సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. లోక్‌సభ స్థానాలతో పాటు వివిధ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఏడు దశల్లో జరగనున్నాయి. తొలి విడత పోలింగ్ ఏప్రిల్ 19న ప్రారంభమవుతుంది. జూన్ 1న ఏడో విడత ఓటింగ్ జరుగుతుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెల్లడి ఉంటుంది.
అయితే ఎన్నికల నేపథ్యంలో ఐపీఎల్‌ను విదేశాల వేదికగా నిర్వహిస్తారనే కథనాలు వస్తున్నాయి. మార్చి 22 నుంచి ప్రారంభంకానున్న ఐపీఎల్ 17వ సీజన్‌లో తొలి 21 మ్యాచ్‌లకు ఇప్పటికే బీసీసీఐ షెడ్యూల్ విడుదల చేసింది. తర్వాత మ్యాచ్‌లను యూఏఈ వేదికగా నిర్వహిస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది.

ఈ కథనాలపై ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ స్పందించాడు. ఆ వార్తలన్నీ అవాస్తమని అరుణ్ ధుమాల్ కొట్టిపారేశాడు. ఐపీఎల్ 17వ సీజన్ మొత్తం భారత్‌లోనే నిర్వహిస్తామని స్పష్టం చేశాడు. ''ఐపీఎల్ మ్యాచ్‌లను ఎక్కడకి మార్చట్లేదు. మిగిలిన మ్యాచ్‌ల షెడ్యూల్‌ను త్వరలోనే ప్రకటిస్తాం'' అని అరుణ్ ధుమాల్ తెలిపాడు.
ఐపీఎల్ షెడ్యూల్‌పై బీసీసీఐ సెక్రటరీ జై షా కూడా స్పందించాడు. ఐపీఎల్ ఎక్కడికీ తరలిపోదని, మిగతా ఐపీఎల్ మ్యాచ్‌ల షెడ్యూల్‌ను త్వరలోనే విడుదల చేస్తామని జై షా పేర్కొన్నాడు. కాగా, ఎన్నికల షెడ్యూల్‌ను అనుసరించి మిగతా మ్యాచ్‌లను షెడ్యూల్ చేయాలని ఐపీఎల్ నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు.
2019 సార్వత్రిక ఎన్నికల సమయంలోనూ ఐపీఎల్‌ను భారత్‌లో నిర్వహించారు. అప్పుడు మార్చి 23 నుంచి మే 12 వరకు ఐపీఎల్ 2019 సీజన్ జరగ్గా.. ఎన్నికలు ఏప్రిల్ 11 నుంచి మే 19 వరకు జరిగాయి. ఆ సీజన్ మాదిరే ఈ సారి ఐపీఎల్‌ను పూర్తి చేయాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
కాగా, మార్చి 22న ప్రారంభ మ్యాచ్‌లో చెపాక్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది. ఇప్పటికే దాదాపు ఆటగాళ్లందరూ తమ ఫ్రాంచైజీ క్యాంప్‌లకు చేరుకున్నారు. సాధన మొదలుపెట్టారు. స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి ఇవాళ భారత్‌కు చేరుకున్నాడు. వ్యక్తిగత కారణాలతో రెండు నెలలు ఆటకు దూరమైన కింగ్ కోహ్లి తిరిగొచ్చాడు.