సన్‌రైజర్స్ హైదరాబాద్ సహ యజమాని కావ్య మారన్ క్రికెట్ ప్రేమికులకు సుపరిచితమే. ఎస్‌ఆర్‌హెచ్ గెలిస్తే కావ్య చేసే సంబరాలు నెట్టింటిని షేక్ చేస్తుంటాయి. జట్టు ఓటమిపాలైనప్పుడూ కావ్య బాధపడిన రియాక్షన్ కూడా వైరల్‌గా మారతుంటుంది. సోషల్ మీడియాలో ఆమె క్రేజ్ అంతలా ఉంటుంది. అయితే ఐపీఎల్ వేలంలో కావ్య పాల్గొన్న సందర్భాల్లో మాత్రం విమర్శలే ఎక్కువగా వస్తుంటాయి.
ఆటగాళ్లను వ్యూహాత్మకంగా సొంత చేసుకోవడంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ మేనేజ్మెంట్ విఫలమవుతుంటుందని విమర్శలు తరుచూ వస్తుంటాయి. కానీ ఈ సీజన్‌లో మాత్రం విమర్శలకు బదులుగా పొగడ్తలు వెల్లువెత్తాయి. ప్యాట్ కమిన్స్ కోసం కావ్య మారన్ రూ. కోట్లు కుమ్మరించినప్పుడు తొలుత అందరూ ఆశ్చర్యపోయారు. ఓ ప్లేయర్ కోసం రూ. 20.50 కోట్లు వెచ్చించడం ఏంటని ప్రశ్నించారు. కానీ ఆ తర్వాత కావ్య మారన్ నిర్ణయాన్ని మెచ్చుకున్నారు.

అయితే ఐపీఎల్‌లో బెస్ట్ ఫ్రాంచైజీ ఓనర్ కావ్య మారన్ అని ఎస్‌ఆర్‌హెచ్ ఓపెనర్ అభిషేక్ శర్మ సోదరి కోమల్ శర్మ అన్నారు. అత్యుత్తమ యజమాని కావ్యనే ఎందుకో ఆమె వివరించారు. సొంత జట్టును ప్రోత్సహించడమే కాకుండా, ప్రత్యర్థి జట్టును మెచ్చుకోవడం కావ్య ప్రత్యేకత అని కోమల్ శర్మ అన్నారు. సోషల్ మీడియా వేదికగా కావ్యను కోమల కొనియాడారు. ''క్రికెట్‌ను ఎంతో ఆస్వాదిస్తుంది. తన జట్టును ప్రోత్సహిస్తుంది. ప్రత్యర్థి టీమ్‌ను కొనియాడుతుంది. కావ్య మారన్ బెస్ట్ ఓనర్'' అని కోమల్ పేర్కొన్నారు.
ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్ విషయానికొస్తే.. గత సీజన్‌లో పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచిన ఎస్‌ఆర్‌హెచ్ ఈ సీజన్‌లో విజయాలతో హోరెత్తిస్తున్న సంగతి తెలిసిందే. టాప్-2లో నిలిచి ప్లేఆఫ్స్‌కు చేరింది. అయితే క్వాలిఫయిర్-1లో కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో ఓడింది. ఫైనల్ బెర్తు కోసం ఇవాళ చెపాక్ వేదికగా క్వాలిఫయర్-2లో రాజస్థాన్ రాయల్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే చెపాక్ వేదికగానే ఆదివారం జరగనున్న టైటిల్ పోరులో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో పోటీపడుతుంది.