ఐపీఎల్ 2024లో హ్యాట్రిక్ విజయాలతో దూసుకెళ్తున్న కోల్‌కతా నైట్ రైడర్స్‌కు చెన్నై సూపర్ కింగ్స్ ఓటమి రుచిచూపింది. చెపాక్ వేదికగా సోమవారం జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్‌ను సీఎస్కే ఏడు వికెట్లతో ఓడించింది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌లు ఆడిన కోల్‌కతాకు ఇదే తొలి ఓటమి.
గత మ్యాచ్‌ల్లో మాదిరిగానే దూకుడైన బ్యాటింగ్‌తో సత్తాచాటాలనుకున్న కోల్‌కతాకు చెపాక్‌లో చెన్నై బౌలర్లు చెక్ పెట్టారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 137 పరుగులే చేసింది. శ్రేయస్ అయ్యర్ (34; 32 బంతుల్లో, 3x4) సునీల్ నరైన్ (27; 20 బంతుల్లో, 3x4, 2x6) టాప్ స్కోరర్లు. రవీంద్ర జడేజా (3/18), తుషార్ దేశ్‌పాండే (3/33)చెరో మూడు వికెట్లతో సత్తాచాటారు.

అనంతరం ఛేదనలో సీఎస్కే 17.4 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (67*; 58 బంతుల్లో, 9x4) జట్టును విజయతీరాలకు చేర్చాడు. కాగా, చెన్నై గెలుపులో కీలకపాత్ర పోషించిన జడేజాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. జడేజా నాలుగు ఓవర్లలో 18 పరుగులే ఇచ్చి కీలక మూడు వికెట్లు పడగొట్టాడు. అయితే ఈ క్రమంలో జడేజా అరుదైన ఘనత సాధించాడు. సీఎస్కే తరఫున అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకున్న ఆటగాడిగా మహేంద్ర సింగ్ ధోనీ సరసన జడ్డూ నిలిచాడు. ధోనీ, జడేజా ఇప్పటివరకు 15 సార్లు ఈ అవార్డు సాధించారు.
ఎంఎస్ ధోనీ, జడేజా తర్వాతి స్థానాల్లో సురేశ్ రైనా, రుతురాజ్ గైక్వాడ్, మైకేల్ హస్సీ ఉన్నారు. రైనా 12 సార్లు, రుతురాజ్, హస్సీ చెరో 10 సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నారు. అలాగే ఈ మ్యాచ్‌లో జడేజా మరో రికార్డు సాధించాడు. ఐపీఎల్‌లో 100 క్యాచ్‌లు అందుకున్న అయిదో ఫీల్డర్‌గా రికార్డులకెక్కాడు. అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లి (110), సురేశ్ రైనా (109), కీరన్ పొలార్డ్ (103), రోహిత్ శర్మ (100), రవీంద్ర జడేజా (100) టాప్-5లో ఉన్నారు. ఆరో స్థానంలో శిఖర్ ధావన్ (98) నిలిచాడు.