టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ రీఎంట్రీ గురించి భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్‌లో పంత్ గ్రాండ్ రీఎంట్రీ ఇస్తాడని, అతిత్వరలో తిరిగి సూపర్ ఫామ్‌ను పొందుతాడని దాదా ఆశాభావం వ్యక్తం చేశాడు. ఐపీఎల్‌లో విదేశీ ప్లేయర్ల కంటే భారత ఆటగాళ్లే ఎంతో కీలకమని పేర్కొన్నాడు. పంత్ ప్రాతినిథ్యం వహిస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్‌కు గంగూలీ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ పదవిలో బాధ్యతలు నిర్వర్తిస్తున్న సంగతి తెలిసిందే.
2022 ఏడాది ఆఖర్లో కారు ప్రమాదానికి గురైన పంత్ ఆ తర్వాత నుంచి ఆటకు దూరమయ్యాడు. ఐపీఎల్‌లో పంత్ స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును డేవిడ్ వార్నర్ నడిపించాడు. గత సీజన్‌లో ఢిల్లీ పేలవ ప్రదర్శన చేసింది. పాయింట్ల పట్టికలో అట్టడుగన నుంచి రెండో స్థానంలో నిలిచింది. మార్చి 22 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 17వ సీజన్‌లో పంత్ రాకతో ఢిల్లీ బలోపేతంగా మారుతుందని గంగూలీ పేర్కొన్నాడు.

''పంత్ రీఎంట్రీ ఢిల్లీ క్యాపిటల్స్‌కు కొండంత బలం. ఎందుకంటే ఐపీఎల్ భారత ప్లేయర్లు బంగారు బాతులు. ఇటీవల పంత్ క్రికెట్ ఆడనప్పటికీ, అతడు తొందరగానే తన లయను తిరిగి అందుకుంటాడని భావిస్తున్నా. అతడు పోటీ క్రికెట్‌కు దూరమై దాదాపు 17 నుంచి 18 నెలలు దాటింది. పునరాగామనం చేయాలని తీవ్రంగా కష్టపడ్డాడు. అతడు ఎంతో నమ్మకంగా ఉన్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్, భారత్ తరఫున ఆడాలనుకుంటున్నాడు. అతడు తిరిగి వస్తుండటం సంతోషంగా ఉంది. ఈ సీజన్‌లో అతడు రాణించాలని కోరుకుంటున్నా''
''ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ప్రారంభ వేడుకల సందర్భంగా పంత్‌ను బెంగళూరులో కలిశాను. మార్చి 22 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 2024లో బరిలో దిగడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇది ఢిల్లీ క్యాపిటల్స్, టీమిండియాకు శుభవార్త'' అని గంగూలీ తెలిపాడు. 2016 నుంచి ఢిల్లీ తరఫున ఆడుతున్న పంత్ 98 మ్యాచ్‌ల్లో 34 సగుటు, 147 స్ట్రైక్‌రేటుతో 2838 పరుగులు చేశాడు. ఓ సెంచరీ, 15 హాఫ్ సెంచరీలు బాదాడు. కాగా, ఢిల్లీ క్యాపిటల్స్ కొన్ని మ్యాచ్‌ల వరకు తమ హోమ్ గ్రౌండ్‌గా వైజాగ్ స్టేడియాన్ని ఎంచుకుంది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ముగిసిన అనంతరం ఢిల్లీ మైదానంలో ఆడుతుంది.