ముంబై ఇండియన్స్ నయా కెప్టెన్ హార్దిక్ పాండ్య తీవ్ర ఒత్తిడిలో పడ్డాడు. ఎన్నో అంచనాల మధ్య రోహిత్ శర్మకు బదులుగా కెప్టెన్సీ పగ్గాలు అందుకున్న హార్దిక్ ఈ సీజన్‌లో ఇంకా బోణీ కొట్టలేదు. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయాడు. గతంలో గుజరాత్ టైటాన్స్ తరఫున సారథి బాధ్యతలు నిర్వర్తించిన ప్రారంభంలో హార్దిక్ హ్యాట్రిక్ విజయాలు సాధించాడు. కానీ ఇప్పుడు ముంబై తరఫున హ్యాట్రిక్ ఓటములు నమోదుచేయడం గమనార్హం.
మరోవైపు ఐపీఎల్ ప్రారంభమైన నుంచి రోహిత్ అభిమానులు హార్దిక్ పట్ల వ్యతిరేకత చూపుతున్నారు. అతడు టాస్‌కు వచ్చే సందర్భంలో 'రోహిత్ రోహిత్' నినాదాలతో హేళన చేస్తున్నారు. ఈ విషయంపై ప్రముఖ వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ కూడా ప్రేక్షకులపై సీరియస్ అయ్యాడు. మంచిగా ప్రవర్తించాలని కోరాడు. అయితే ఈ విషయాలన్ని విడిచిపెట్టి హార్దిక్ ముంబై జట్టు కూర్పు గురించి ఆలోచించాలని మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ పేర్కొన్నాడు.

ఓటమి గల కారణాలు విశ్లేషించుకుంటూ జట్టు బలోపేతంగా మారడానికి ప్రయత్నించాలని సిద్ధూ అన్నాడు. ముంబై జట్టు పరాజయాల్ని మాత్రమే చవిచూసిందని, పరువు పోయేలా ఏం ఆడలేదని అన్నాడు. ''తమ హీరో,భారత కెప్టెన్ అయిన రోహిత్ శర్మ ఐపీఎల్‌లో ఫ్రాంచైజీకి కెప్టెన్ కాలేకపోయాడని విషయాన్ని రోహిత్ అభిమానులు అంత సులువుగా జీర్ణించుకోలేరు. అతడు చేసిన తప్పేంటి? అనే ఆలోచిస్తారు. అయితే విజయాలతో వివాదానికి ముగింపు లభిస్తుంది''
''ముంబై ఇండియన్స్ గత రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధిస్తే ప్రతి ఒక్కరూ నిశ్శబ్ధంగా ఉండేవారు. అయితే హార్దిక్ పాండ్య జట్టు కూర్పు గురించి ఆలోచించాలి. సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్‌లో 277 పరుగులు ఇచ్చినప్పుడు బౌలింగ్ పేలవంగా ఉందని అందరూ విమర్శించారు. ఐపీఎల్ వంటి టోర్నీలో అన్ని పరుగులు ఎలా సాధ్యమని అన్నారు. అయితే గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై విజయానికి దగ్గరగా వచ్చి ఓడింది. కాబట్టి వాళ్లు ఓటమిపాలయ్యారంతే. పరువు పోలేదు''
''ఇలాంటి పరిస్థితుల్లో ధోనీ ఏం చేస్తాడో ఆలోచించాలి. గత సీజన్‌లో తమ లీడింగ్ రన్ స్కోరర్ డెవాన్ కాన్వే గాయంతో ఈ సీజన్‌కు దూరమయ్యాడు. ఆ స్థానంలో కాన్వేకు తగ్గట్లుగా రచిన్ రవీంద్రతో భర్తీచేశారు. హార్దిక్ పాండ్య కూడా ఇలాంటి ప్రత్యామ్నాయాల గురించి ఆలోచించాలి. లేదంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటాడు'' అని నవజ్యోత్ సింగ్ సిద్ధూ పేర్కొన్నాడు.