గుజరాత్ టైటాన్స్‌ను వీడి ముంబై ఇండియన్స్‌కు వెళ్లిన స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యపై మాజీ క్రికెటర్ శ్రీశాంత్ కీలక వ్యాఖ్యలు చేశాడు. హార్దిక్ లేకపోవడంతో గుజరాత్ బౌలర్లు స్వేచ్ఛగా బౌలింగ్ చేస్తారని అన్నాడు. ఇటీవల జరిగిన వేలానికి ముందు ట్రేడింగ్‌లో హార్దిక్ ముంబై ఇండియన్స్ గూటికి చేరిన విషయం తెలిసిందే.
కెప్టెన్‌గా గుజరాత్‌ను రెండు సార్లు జట్టును ఫైనల్‌కు చేర్చిన హార్దిక్ ముంబైకి వెళ్లడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మరోవైపు హార్దిక్ రాకతో ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ కెప్టెన్సీ బాధ్యతల నుంచి రోహిత్ శర్మను తప్పించింది. పది సీజన్లలో అయిదు టైటిళ్లు సాధించిన రోహిత్‌ను కాదని యువ కెప్టెన్ హార్దిక్ వైపు మొగ్గుచూపింది. ఈ నిర్ణయం జట్టులో అంతర్గత విభేదాలను సృష్టించింది.

ఈ వివాదం కొనసాగుతుండగా హార్దిక్ పాండ్య గురించి శ్రీశాంత్ చేసిన వ్యాఖ్యలు మరో చర్చకు దారితీస్తుంది. బౌలర్లకు హార్దిక్ స్వేచ్ఛ ఇవ్వడని అర్థం వచ్చేలా శ్రీశాంత్ పేర్కొన్నాడు. ''బౌలర్లు ఏం చేయాలో చెప్పడానికి గుజరాత్ టైటాన్స్‌లో హార్దిక్ పాండ్య లేడు. కొన్నిసార్లు బౌలర్లకు స్వేచ్ఛగా బౌలింగ్ చేసేలా అవకాశం ఇవ్వాలి. ఇప్పుడు కొత్త కెప్టెన్ శుభ్‌మన్ గిల్, కోచ్ ఆశిష్ నెహ్రా బౌలర్లకు ఆ అవకాశం ఇస్తారనుకుంటున్నా. అంతేగాక యువ కెప్టెన్ జట్టులో ఉన్నప్పుడు బౌలర్లు మరింత బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. టీమ్‌లో యంగ్ కెప్టెన్ ఉంటే ఇదొక్క లాభం'' అని శ్రీశాంత్ తెలిపాడు.
కాగా, ఈ సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఒక్క విజయం సాధించింది. అహ్మదాబాద్‌లో ముంబై ఇండియన్స్‌పై గెలిచింది. చెపాక్‌లో సీఎస్‌కే చేతిలో ఓటమిపాలైంది. అయితే ముంబై మ్యాచ్‌లో 169 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ బౌలర్లు కాపాడుకున్నారు. సమష్టిగా కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి జట్టును గెలిపించుకున్నారు. ముంబై విజయానికి ఆఖరి 6 ఓవర్లలో 48 పరుగులు అవసరమయ్యాయి. చేతిలో ఏడు వికెట్లు ఉన్నాయి. అయినప్పటికీ గుజరాత్ బౌలర్ల ధాటికి ముంబై ఓటమిపాలైంది.
కానీ, నిన్న చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ 63 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. మొదట బ్యాటింగ్ చేసిన సీఎస్‌కే నిర్ణీత 20 ఓవర్లకు ఆరు వికెట్లు కోల్పోయి 206 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో గుజరాత్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 143 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ (37; 31 బంతుల్లో) పోరాడాడు.