SRH vs RCB: ఐపీఎల్ 2024 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరో ఓటమిని మూటగట్టుకుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై జరిగిన మ్యాచ్‌లో పోరాడి ఓడింది. 287 పరుగుల భారీ లక్ష్యాన్ని అందుకునే క్రమంలో చివరి బంతి వరకూ పోరాడింది గానీ అది సరిపోలేదు. 262 పరుగుల వద్ద దాని ప్రస్థానం ఆగిపోయింది.
ఆర్సీబీకి ఇది వరుసగా అయిదో ఓటమి. ఇప్పటివరకు ఆడిన ఏడు మ్యాచ్‌లల్లో ఒక్కటంటే ఒక్కదాంట్లోనే గెలిచింది. రెండు పాయింట్లతోనే సరిపెట్టుకుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో దాని స్థానం.. 10. ఇక తన తదుపరి మ్యాచ్‌ను ఈ నెల 21వ తేదీన ఆడబోతోంది. కోల్‌కత నైట్ రైడర్స్‌ను ఢీ కొట్టబోతోంది. కోల్‌కత ఈడెన్ గార్డెన్స్ దీనికి వేదిక.

సోమవారం రాత్రి బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో టాస్ ఓడిపోయి తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్న ఆర్సీబీ.. ప్రత్యర్థిని కట్టడి చేయడంలో ఘోరంగా విఫలమైంది. నిర్ణీత 20 ఓవర్లల్లో మూడు వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది సన్‌రైజర్స్. ఓపెనర్ ట్రావిస్ హెడ్ సెంచరీతో కదం తొక్కాడు. అతనికి హెన్రిచ్ క్లాసెన్ తోడు కావడంతో ఎస్ఆర్‌హెచ్ భారీ స్కోర్ చేయగలిగింది.
అనంతరం ఛేజింగ్‌కు దిగిన ఆర్సీబీ బ్యాటర్లు ప్రారంభ, చివరి ఓవర్లల్లో విజృంభించి ఆడారు గానీ ఎక్కువ సేపు క్రీజ్‌లో నిల్చోలేకపోయారు. మిడిలార్డర్ విఫలం కావడం, మిడిల్ ఓవర్లల్లో భారీ భాగస్వామ్యం ఏర్పడకపోవడం వారి పరాజయానికి దారి తీసింది. లోయర్ ఆర్డర్‌లో నిలకడగా రాణిస్తోన్న దినేష్ కార్తీక్ 35 బంతుల్లో ఏడు సిక్సర్లు, అయిదు ఫోర్లతో 83 పరుగులు చేసి, చివరి వరకు జట్టును గెలిపించడానికి కృషి చేశాడు.
ఇలా అధ్వాన్నపు ఆటతీరును ప్రదర్శిస్తోన్న ఆర్సీబీపై భారత జట్టు మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఓడిపోయినప్పడు ప్లేయర్లను మోటివేట్ చేయడం, వారిలో స్ఫూర్తినింపడం జట్టు మేనేజ్‌మెంట్‌కు ఇబ్బందికరంగా పరిణమించినట్లు తాను భావిస్తోన్నానని అన్నాడు.

హెడ్ కోచ్ ఆండ్లీ ఫ్లవర్, బౌలింగ్ కోచ్ ఆడమ్ గ్రిఫిత్ విదేశీయులు కావడం వల్ల వాళ్లు చెప్పే భాషను ఆర్సీబీ ప్లేయర్లు సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నారని, కమ్యునికేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని పేర్కొన్నాడు. ఆర్సీబీలో ఆడే సగం మంది భారతీయ ప్లేయర్లు ఇంగ్లీష్‌ను అర్థం చేసుకోలేరని, ఇలాంటప్పుడు వారిని ఎలా మోటివేట్ చేయగలుగుతారు? వారిలో ఎలా స్ఫూర్తి నింపగలుగుతారని ప్రశ్నించాడు.
ఆర్సీబీలో ఆడే ఇండియన్ ప్లేయర్లు తమ భావాలను హెడ్ కోచ్, బౌలింగ్ కోచ్‌తో పంచుకోలేకపోతున్నారని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. ఆర్సీబీ సపోర్టింగ్ స్టాఫ్‌లో ఎక్కువ మంది భారతీయులు లేకపోవడం ఈ సమస్యకు ప్రధాన కారణమని వ్యాఖ్యానించాడు. తమ సపోర్టింగ్ స్టాఫ్‌లో ఒకరిద్దరు భారతీయులను తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాడు.
టీమ్‌లో డజను మంది భారతీయ ఆటగాళ్లు ఉండగా.. మరో 10 మంది వరకు ఓవర్సీస్ ప్లేయర్లు ఉన్నారని, సపోర్టింగ్ స్టాఫ్ మొత్తం విదేశీయులే ఉన్నారని, అక్కడే అసలు సమస్య తలెత్తుతోందని సెహ్వాగ్ వివరించాడు. సపోర్టింగ్ స్టాఫ్‌లో ఒక్కరు కూడా భారతీయుడు లేరని, కనీసం ముగ్గురినైనా తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పాడు.