Virat Kohli: ఐపీఎల్ 2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరో కీలక మ్యాచ్ ఆడుతోంది. అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌తో తలపడుతోంది. ఆర్సీబీకి గెలిచి తీరాల్సిన మ్యాచ్ ఇది. ఇప్పటికే ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగా నిలుపుకోవాలంటే ఇందులో గెలవక తప్పని పరిస్థితిని ఎదుర్కొంటోంది.
వరుస ఓటములతో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది. ఇప్పటివరకు ఆడిన తొమ్మిది మ్యాచ్‌లల్లో గెలిచింది రెండింట్లో మాత్రమే. ప్రస్తుతం ఆ జట్టు ఖాతాలో నాలుగు పాయింట్లు ఉన్నాయి. గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్ కాకుండా ఇంకా నాలుగు గేమ్‌లు చేతిలో ఉన్న నేపథ్యంలో అన్నింట్లోనూ మంచి రన్‌రేట్‌తో గెలవగలిగితే తన పాయింట్ల సంఖ్యను పెంచుకోగలుగుతుంది. ప్లే ఆఫ్స్ ఆశలు మెరుగుపడొచ్చు.

టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది ఆర్సీబీ. ఈ ప్లాన్ పెద్దగా సత్ఫలితాలను ఇవ్వలేదు. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ టైటాన్స్ స్కోర్ బోర్డుపై 200 పరుగులను జమ చేసింది. ఈ క్రమంలో మూడు వికెట్లను కోల్పోయింది. ఓపెనర్లు వృద్ధిమాన్ సాహా, శుభ్‌మన్ గిల్ త్వరగా అవుట్ అయినప్పటికీ.. సాయి సుదర్శన్- 84, షారుఖ్ ఖాన్- 58 పరుగులతో చెలరేగారు.
ఎప్పట్లాగే ఆర్సీబీ బౌలింగ్ డిపార్ట్‌మెంట్ ఈ మ్యాచ్‌లో కూడా విఫలమైంది. గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్ ఆర్డర్‌ను ఇబ్బంది పెట్టలేకపోయింది. వారిపై ఒత్తిడిని తీసుకుని రావడంలో చేతులెత్తేసింది. కామెరాన్ గ్రీన్, కర్ణ్ శర్మ, గ్లెన్ మ్యాక్స్‌వెల్ భారీగా పరుగులను ఇచ్చుకున్నారు. మహ్మద్ సిరాజ్, స్వప్నిల్ సింగ్, మ్యాక్స్‌వెల్ ఒక్కో వికెట్ పడగొట్టారు.
ఈ మ్యాచ్‌లో ఆర్సీబీకి అటు ఎండ కూడా విలన్‌గా మారింది. మ్యాచ్ కొనసాగుతున్న సమయంలో 39 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది అహ్మదాబాద్‌లో. స్టేడియంలో ఆడియన్సే కాకుండా అటు ఫీల్డర్లు కూడా ఉక్కపోతతో ఇబ్బంది పడ్డారు. ధారాళంగా కారుతున్న చెమటతో విరాట్ కోహ్లీ ఇబ్బంది పడటం కనిపించింది.