ఐపీఎల్ 17వ సీజన్‌లో మరో ఆసక్తికరపోరుకు రంగం సిద్ధమైంది. బలమైన ముంబై ఇండియన్స్‌తో రన్నరప్ గుజరాత్ టైటాన్స్ తలపడనుంది. ఈ పోరు అహ్మదాబాద్ వేదికగా ఆదివారం రాత్రి 7.30 గంటలకు జరగనుంది. గుజరాత్ నుంచి హార్దిక్ పాండ్య ముంబయి గూటికి చేరిన నేపథ్యంలో ఈ మ్యాచ్‌పై ఆసక్తి మరింత పెరిగింది.
గత రెండు సీజన్లలో గుజరాత్ టైటాన్స్‌ను హార్దిక్ నడిపించాడు. 2022 సీజన్‌లో టైటిల్ కూడా అందించాడు. ఇప్పుడు అదే గుజరాత్‌పై ప్రత్యర్థి నాయకుడిగా బరిలోకి దిగుతున్నాడు. మరోవైపు ముంబై ఇండియన్స్ జట్టులో అంతర్గత విభేదాలు ఉన్నాయా? హార్దిక్-రోహిత్ స్నేహ బంధం బలంగానే ఉందా? అనే ప్రశ్నలకు రేపు సమాధానాలు దొరకనున్నాయి.

హార్దిక్ కెప్టెన్సీలో రోహిత్ శర్మ ఎలాంటి పాత్ర పోషిస్తాడు? హిట్‌మ్యాన్‌ను ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దించుతాడా? ఇంకా పూర్తిగా కోలుకోని సూర్యకుమార్ యాదవ్ స్థానంలో ఎవరు జట్టులోకి రానున్నారు? అని జట్టు కూర్పు గురించి కూడా అభిమానుల్లో ఆసక్తి మొదలైంది. అయితే భారీ ఒత్తిడిలో జట్టు పగ్గాలు అందుకున్న హార్దిక్ జట్టుఎంపికపై జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు.
ఓపెనర్లుగా రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ బరిలోకి దిగనున్నారు. మానసిక అలసట కారణంగా ఆటకు దూరమైన ఇషాన్ తిరిగి రీఎంట్రీ ఇస్తున్నాడు. ఈ నేపథ్యంలో అతడిపై ఒత్తిడి తగ్గించేలా హిట్‌మ్యాన్ విధ్వంసకర బ్యాటింగ్ చేయాలని ముంబై యాజమాన్యం సూచించినట్లు తెలుస్తోంది. వన్‌డౌన్‌లో తెలుగు కుర్రాడు తిలక్ వర్మ రానున్నాడు. అయితే నాలుగో స్థానంలో వచ్చే సూర్య ఇంకా ఫిట్‌నెస్ క్లియరెన్స్ పొందలేదు. మ్యాచ్ ప్రారంభమయ్యే సమయానికి అతడికి ఎన్సీఏ నుంచి అనుమతి రాకపోతే సూర్య బెంచ్‌కే పరిమితమవుతాడు.
ఈ పరిస్థితి ఎదురైతే హార్దిక్ పాండ్య నాలుగో స్థానంలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంతేగాక నేహాల్ వాదేరా, విష్ణు వినోద్, సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్‌కు కూడా స్థానం దక్కే ఛాన్సులు ఉన్నాయి. నేహాల్, అర్జున్ బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్ చేయగలరు. టిమ్ డేవిడ్‌ను నాలుగో స్థానానికి ప్రమోట్ చేసే ఆలోచనలోనూ ముంబై ఉంది. అయితే విదేశీ ప్లేయర్ల కోటాలో టిమ్ డేవిడ్, మహ్మద్ నబీ, కొయెట్జీ, ల్యూక్ వుడ్ లేదా క్వెనా మపాంకను జట్టులోకి తీసుకోనున్నారు.
ముంబై ఇండియన్స్ తుదిజట్టు అంచనా
రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, నేహాల్ వాదేరా, హార్దిక్ పాండ్య, టిమ్ డేవిడ్, మహ్మద్ నబీ, గెరాల్డ్ కొయెట్జీ, పీయుష్ చావ్లా, జస్ప్రీత్ బుమ్రా, ల్యూక్ వుడ్/క్వెనా మపాంక
సబ్‌స్టిట్యూట్: విష్ణు వినోద్ (ఇంపాక్ట్)