మరికొన్ని రోజుల్లో ఐపీఎల్ సందడి మొదలుకానుంది. మార్చి 22 నుంచి ఐపీఎల్ 17వ సీజన్ ప్రారంభంకానుంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది. ప్రతి సీజన్‌కు ఆరంభానికి ముందు వచ్చే నినాదాలే మళ్లీ వినిపిస్తున్నాయి. 'ఈ సాలా కప్ నమదే' అంటూ ఆర్సీబీ ఫ్యాన్స్ సందడి షురూ చేశారు.
అయితే ఈ సారి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కప్ సాధించేలా కనిపిస్తోంది. ట్రోఫీ ఫేవరేట్ జట్లలో టాప్‌లో ఉంది. గత 16 సీజన్ల నుంచి వేధిస్తున్న బెంగళూరు సమస్య అయిన బౌలింగ్.. ఈ సారి పరిష్కారం దొరికింది. ఇటీవల జరిగిన వేలంలో బౌలింగ్ కోసం మేనేజ్మెంట్ ప్రత్యేక వ్యూహాలు రచించిన విషయం తెలిసిందే. అయితే ఫేమస్ కానీ అల్జారి జోషెఫ్ (రూ. 11.50 కోట్లు), యశ్ దయాల్ (రూ. 5 కోట్లు) కోసం కోట్లు ఖర్చుపెట్టడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోయారు.

కానీ ఆర్సీబీకి ఈ సారి అదృష్టం కలిసొస్తుంది. రూ.కోట్టు కుమ్మరించిన ఆటగాళ్ల కంటే కాస్త తక్కువ ధరకు సొంతం చేసుకున్న ఆటగాళ్లు సంచలన ప్రదర్శన చేస్తున్నారు. రిటైన్ చేసుకున్న ఆకాశ్ దీప్.. రాంచీ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో నిప్పులు చెరిగే బంతులు విసిరాడు. కొత్తబంతితో తానెంత ప్రమాదకర బౌలరో ప్రపంచానికి చాటిచెప్పాడు. మరికొన్ని రోజులు ఆకాశ్ అదే జోరును కొనసాగిస్తే.. మహ్మద్ సిరాజ్‌తో కలిసి ఐపీఎల్‌లో పేస్ దాడిని మొదలుపెడతాడు.
ఆర్సీబీకి మరో లక్ తగిలింది. రూ.2 కోట్లకే సొంతం చేసుకున్న న్యూజిలాండ్ పేసర్ ఫెర్గూసన్ విజృంభిస్తున్నాడు. ఇటీవల బలమైన ఆస్ట్రేలియా జట్టును వణికించాడు. ఈ ఏడాదిఫెర్గూసన్ ఆడిన టీ20ల్లో.. 1/27, 2/27, 2/25, 1/23, 4/12తో అద్భుత ప్రదర్శన చేశాడు. ఆస్ట్రేలియాపై 3.5 ఓవర్లలో 12 పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఫామ్‌లో ఉన్న ఫెర్గూసన్ రాకతో ఆర్సీబీ పేస్ కష్టాలు తొలగిపోయేలా ఉన్నాయి.
డెత్ బౌలింగ్‌లో ఫెర్గూసన్ చక్కగా బాధ్యతలు నిర్వర్తించగలడు. అతడితో పాటు సిరాజ్, ఆకాశ్ దీప్ చెరో ఓవర్ వేస్తే ఆఖరి ఓవర్లలో ప్రత్యర్థి జట్టును నిలువరించవచ్చు. ఇక విరాట్ కోహ్లి, డుప్లెసిస్, మాక్స్‌వెల్, దినేశ్ కార్తీక్, కామెరూన్ గ్రీన్‌లతో బ్యాటింగ్ పటిష్టంగా కనిపిస్తోంది. కర్ణ శర్మతో పాటు మాక్సీ స్పిన్ సంగతి చూసుకుంటారు. రజత్ పటిదార్, అనుజ్ రావత్‌తో ఆల్‌రౌండర్ గ్రీన్ సత్తాచాటితే 16 ఏళ్ల ఆర్సీబీ కప్ కల ఈ సారి తీరినట్లే!
ఆర్సీబీ జట్టు: ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), గ్లెన్ మాక్స్‌వెల్, విరాట్ కోహ్లి, కామెరాన్ గ్రీన్ (ట్రేడెడ్), రజత్ పటిదార్, అనుజ్ రావత్, దినేశ్ కార్తీక్, సుయాష్ ప్రభుదేశాయ్, విల్ జాక్స్, మహిపాల్ లోమ్రోర్, కర్ణ్ శర్మ, మనోజ్ భాండాగే, మయాంక్ దాగర్ (ట్రేడెడ్), ఆకాష్ దీప్, మహ్మద్ సిరాజ్, రీస్ టాప్లీ, హిమాన్షు శర్మ, రాజన్ కుమార్, విజయ్ కుమార్ వైషాక్, అల్జారి జోషెఫ్ (రూ. 11.50 కోట్లు), యశ్ దయాల్ (రూ. 5 కోట్లు), ఫెర్గూసన్ (రూ. 2 కోట్లు), టామ్ కరన్ (రూ. 1.50 కోట్లు), సౌరభ్ చౌహాన్ (రూ. 20 లక్షలు), స్వప్నిల్ సింగ్ (రూ. 20 లక్షలు)