కోల్‌కతా నైట్ రైడర్స్ పదేళ్ల నిరీక్షణకు తెరపడింది. దశాబ్దం తర్వాత ట్రోఫీని ముద్దాడింది. ఐపీఎల్ 2024 సీజన్ ఆరంభం నుంచి ఛాంపియన్‌లానే విజయాలతో దూసుకెళ్లిన కేకేఆర్ అంతిమంగా విజేతగా నిలిచింది. చెపాక్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఫైనల్‌లో ఎనిమిది వికెట్ల తేడాతో ఘనంగా నెగ్గి టైటిల్ అందుకుంది. కోల్‌కతాకు ఇది మూడో ట్రోఫీ. 2012, 2014 సీజన్‌లోనూ కేకేఆర్ కప్‌ను అందుకుంది.
ఏకపక్షంగా సాగిన ఫైనల్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ 18.3 ఓవర్లలోనే 113 పరుగులకు ఆలౌటైంది. ఐపీఎల్ ఫైనల్స్‌లో ఓ జట్టుకు ఇదే అత్యల్ప స్కోరు.కెప్టెన్ కమిన్స్ (24; 19 బంతుల్లో, 2x4, 1x6) టాప్ స్కోరర్. కోల్‌కతా బౌలర్లలో రసెల్ (3/19) మూడు, స్టార్క్ (2/14), హర్షిత్ రాణా (2/24) చెరో రెండు వికెట్లు తీశారు. అనంతరం ఛేదనలో కేకేఆర్ రెండు వికెట్లు కోల్పోయి 10.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని సాధించింది. వెంకటేశ్ అయ్యర్ (52; 26 బంతుల్లో, 4x4, 3x6) అజేయ అర్ధశతకం సాధించి జట్టును విజయతీరాలకు చేర్చాడు.

వెంకటేశ్ అయ్యర్ విన్నింగ్ షాట్ ఆడిన తర్వాత స్టేడియం ఫైర్‌వర్క్‌తో కళకళలాడింది. డగౌట్ నుంచి కేకేఆర్ ఆటగాళ్లు మైదానంలోకి దూసుకొచ్చారు. ఆనందంతో ఎగిరి గంతేశారు. జట్టును గెలిపించిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, వెంకటేశ్ అయ్యర్‌లను హగ్ చేసుకుని మురిసిపోయారు. అయితే కేకేఆర్ సంబరాల్లో క్రికెట్ అభిమానులు ఎన్నటికీ మరిచిపోలేని కొన్ని మధురక్షణాలు చోటు చేసుకున్నాయి.
ఫైనల్‌గా ఫైనల్లో సునీల్ నరైన్ నవ్వాడు. వికెట్ తీసినా, క్యాచ్ పట్టినా, సెంచరీ సాధించినా ఒక్కసారి కూడా మైదానంలో నవ్వని నరైన్ తుదిపోరులో తమ జట్టు గెలిచిన అనంతరం నవ్వుతూ కేరింతలు కొట్టాడు. తమ మెంటార్ గౌతమ్ గంభీర్‌ను ఎత్తుకుని సెలబ్రేట్ చేసుకున్నాడు. గంభీర్ కూడా నరైన్‌ను ఎత్తుకుని సంబరాలు చేశాడు. ఇక గంభీర్ నుదుటి మీద కేకేఆర్ యజమాని షారుక్ ఖాన్ ముద్దుపెట్టాడు. మరోవైపు రసెల్ భావోద్వేగానికి గురయ్యాడు. అతని కళ్లలో ఆనందభాష్పాలు కనిపించాయి. విజయానంతరం బిగ్గరగా అరిచిన రసెల్ ఆ తర్వాత ఎమోషనల్ అయ్యాడు.