Ravichandran Ashwin: ఐపీఎల్ 2024 సీజన్ టైటిల్ హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ ఇప్పటివరకూ బోణీ చేయలేదు. ఆడిన రెండింట్లోనూ తన ప్రత్యర్థుల చేతిలో చిత్తయింది. ఈ వరుస ఓటములు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. రెండు మ్యాచ్‌లల్లోనూ పరాజయాలను చవి చూడటం ఆ జట్టు కాన్ఫిడెంట్‌ను దెబ్బ తీసినట్టయింది.
ఈ ఓటముల దెబ్బకు కేప్టెన్ హార్దిక్ పాండ్యా మీమర్స్, హేటర్స్‌కు టార్గెట్ అయ్యాడు. విచ్చలవిడిగా అతన్ని ట్రోల్ చేశారు మీమర్స్. రోహిత్ శర్మను కాదని హార్దిక్ పాండ్యాకు కేప్టెన్సీని అప్పగించడమే దీనికి కారణమని ప్రత్యేకించి చెప్పుకోనక్కర్లేదు. రోహిత్ శర్మను అభిమానించే వాళ్లంతా పాండ్యాను ట్రోల్ చేయడం ద్వారా తమ కోపాన్ని, అసహనాన్ని ప్రదర్శించారు.

దీనిపై రాజస్థాన్ రాయల్స్ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ స్పందించాడు. హార్దిక్ పాండ్యాను ట్రోల్ చేయడాన్ని తప్పు పట్టాడు. ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై జరిగే వార్ చాలా అసహ్యంగా మారుతోందని ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీనికి ముగింపు పలకాల్సిన అవసరం ఉందని చెప్పాడు.
క్రికెట్ అనలిస్ట్ ప్రసన్న అగోరమ్‌తో తన యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడాడు. అభిమానుల మధ్య తలెత్తిన ఈ యుద్ధానికి తెర దించడానికి ముంబై ఇండియన్స్ మేనేజ్‌మెంట్ రంగంలోకి దిగాలని అన్నాడు. ఫ్రాంచైజీకి గానీ, ప్లేయర్‌కు గానీ ఇందులో ఎలాంటి ప్రమేయం ఉండదని, సమయానుకూలంగా నిర్ణయాలను తీసుకుంటుంటాయని, దాన్ని ఎవరూ తప్పుపట్టలేరని చెప్పాడు.
ఇలాంటి ఫ్యాన్ వార్.. అనేది మరే దేశంలోనైనా ఉండబోదని అశ్విన్ పేర్కొన్నాడు. ఇంగ్లాండ్‌లో జో రూట్- జాక్ క్రాలీ, జో రూట్-జోస్ బట్లర్, ఆస్ట్రేలియాలో స్టీవ్ స్మిత్-పాట్ కమ్మిన్స్ అభిమానులు ఇలా ఎప్పుడైనా గొడవ పడటం ఎప్పుడైనా చూశారా? అని ప్రశ్నించాడు. ఇలా గొడవ పడటం వెర్రితనం అని ఘాటుగా విమర్శించాడు.
అభిమానులు గొడవ పడటానికి, తిట్టుకోవడానికి ఇదేమీ సినిమా రంగం కాదని అశ్విన్ హితవు పలికాడు. అభిమానుల మధ్య జరిగే యుద్ధం ఎప్పుడూ ఇలా పక్కదారి పట్టకూడదని, ప్రతి ఒక్క ప్లేయర్ కూడా ఈ దేశానికి ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్నాడనే గుర్తుంచుకోవాలని సూచించాడు. తాము ఆరాధించే ప్లేయర్ బాగా ఆడుతుంటే ఆస్వాదించాలే తప్ప మరో ఆటగాడు ఆడకపోతే ట్రోల్ చేయడం సరికాదని అన్నాడు.
సచిన్ టెండూల్కర్ వంటి దిగ్గజ ప్లేయర్.. సౌరవ్ గంగూలీ కేప్టెన్సీలో ఆడాడు. వారిద్దరూ కలిసి రాహుల్ ద్రావిడ్ కెప్టెన్సీలో ఎన్నో మ్యాచ్‌లను గెలిపించారు. ఈ ముగ్గురూ అనిల్ కుంబ్లే సారథ్యంలో ఆడారు. తమకంటే జూనియర్ అయిన ఎంఎస్ ధోనీ కేప్టెన్సీలో వారందరూ మ్యాచ్‌లను ఆడినవాళ్లేనని గుర్తు చేశాడు.