Sanju Samson: మొన్నటి వరకు ఐపీఎల్ 2024 సీజన్‌పై పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ వచ్చిన రాజస్థాన్ రాయల్స్ ఇప్పుడు చతికిల పడుతోంది. ఇంకో మ్యాచ్ గెలిస్తే దర్జాగా ప్లేఆఫ్స్‌కు చేరుకునే ఈ దశలో బోల్తా కొడుతోంది. బ్యాక్ అండ్ బ్యాక్ మ్యాచ్‌లల్లో పరాజయాన్ని చవి చూసింది. పాయింట్ల పట్టికలో టాప్ పొజీషన్ నుంచి కిందికి దిగింది.
తన చివరి రెండు మ్యాచ్‌లల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ కేపిటల్స్ చేతిల్లో మట్టి కరిచింది సంజు శాంసన్ సేన. మంగళవారం రాత్రి ఢిల్లీ అరుణ్‌జైట్లీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ కేపిటల్స్ చేతిలో 20 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ- నిర్ణీత 20 ఓవర్లల్లో ఎనిమిది వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది.

ఓపెనర్ జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్ తన ఫామ్‌ను కంటిన్యూ చేశాడు. 20 బంతుల్లో మూడు భారీ సిక్సర్లు, ఏడు ఫోర్లతో సరిగ్గా హాఫ్ సెంచరీ చేశాడు. అభిషేక్ పోరెల్- 65, ట్రిస్టన్ స్టబ్స్- 41 రాణించడంతో 221 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించగలిగింది. అనంతరం ఛేజింగ్‌కు దిగిన రాజస్థాన్ రాయల్స్ చివరి వరకు పోరాడింది గానీ.. 201 పరుగుల వద్దే నిలిచి పోయింది దాని ప్రస్థానం.
ఈ మ్యాచ్‌లో కేప్టెన్ సంజు శాంసన్ ఒంటరిపోరాటం చేశాడు. ఆరు సిక్సర్లు, ఎనిమిది ఫోర్లతో 86 పరుగులు చేశాడు. రియాన్ పరాగ్- 27, శుభం దుబే- 25, జోస్ బట్లర్- 19 మినహా మరెవరూ ఆ మాత్రం చేయలేకపోయారు.
సంజు శాంసన్ అవుట్ అయిన విధానం దుమారం రేపింది. ఇన్నింగ్ 16వ ఓవర్ నాలుగో బంతికి అతను అవుట్ అయ్యాడు. ముఖేష్ కుమార్ వేసిన డెలివరీని లాంగ్ ఆన్ దిశగా భారీ షాట్ ఆడాడు. అక్కడే పొంచివున్న షై హోప్.. ఆ బంతిని అద్భుతంగా అందుకున్నాడు. ఆ సమయంలో అతని పాదాలు బౌండరీ లైన్‌ను టచ్ అయ్యాయనేది వాదన.
బంతిని అందుకున్న తరువాత బౌండరీ లైన్ అవతలికి తూలి పడబోయిన షై హోప్.. తమాయించుకునే క్రమంలో రోప్‌కు సమాంతరంగా మూడుసార్లు ఎగిరాడు. ఆ క్రమంలో అతని షూస్ ఎడ్జ్.. రోప్‌ను తాకిందని భావించారంతా. అంపైర్ అవుట్ ఇవ్వడంతో సంజు శాంసన్ ఆయనతో ఆర్గ్యుమెంట్స్‌కు దిగాడు. కొద్దిసేపు వాదించాడు. క్రీజ్‌ను వదలడానికి ఇష్టపడలేదు.
ఇది- సంజు శాంసన్‌పై భారీ పెనాల్టీకి దారి తీసింది. అతనికి చెల్లించే మ్యాచ్ ఫీజులో నుంచి 30 శాతం మేర కోత పడింది. ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం.. అంపైర్లతో వాగ్వివాదానికి దిగడం, అవుట్ ఇచ్చిన తరువాత క్రీజ్‌ను వదలకపోవడం వంటి చర్యలు ఉల్లంఘన కిందికి వస్తాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని 30 శాతం మేర ఫీజులో కోత పెట్టారు.