కోల్‌కతా నైట్ రైడర్స్ స్టార్ ప్లేయర్ సునీల్ నరైన్ మైదానంలో చాలా సీరియస్‌గా ఉంటాడు. వికెట్ తీసినా, సిక్సర్ బాదినా కూడా అతని ముఖంలో అస్సలు చిరునవ్వు ఉండదు. అందుకే సోషల్ మీడియాలో నరైన్ గురించి ప్రత్యేకమైన మీమ్స్ వస్తుంటాయి. ఎమోషన్స్‌ను నరైన్‌లా కంట్రోలో చేసుకోవాలని కొందరు, నరైన్‌కు అసలు హాస్య గ్రంధులు లేవని మరికొందరు కామెంట్లు చేస్తుంటారు.
నరైన్‌ను ట్రోల్ చేసే బ్యాచ్‌లో తాజాగా ముంబై ఇండియన్స్ విధ్వంసకర బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ కూడా చేరాడు. కాస్త ఇప్పుడైనా నవ్వురా బాబు అంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీ పెట్టాడు. అసలేం జరిగిదంటే.. బుధవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేకేర్ 106 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 272 పరుగులు చేసింది.

ఐపీఎల్ చరిత్రలో ఇదే రెండో అత్యధిక స్కోరు. సునీల్ నరైన్ (85; 39 బంతుల్లో 7×4, 7×6) విధ్వంసం సృష్టించాడు. ఫోర్లు, సిక్సర్లతో ఢిల్లీ బౌలర్లకు చుక్కలు చూపించాడు. నరైన్‌తో పాటు రఘువంశీ (54; 27 బంతుల్లో 5×04, 3×6), రసెల్ (41; 19 బంతుల్లో 4×4, 3×6), రింకూ సింగ్ (26; 8 బంతుల్లో 4×4, 3×6) చెలరేగారు. అనంతరం ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ 17.2 ఓవర్లలో 166 పరుగులకే కుప్పకూలింది. రిషభ్ పంత్ (55; 25 బంతుల్లో 4×4, 5×6), ట్రిస్టియన్ స్టబ్స్ (54; 32 బంతుల్లో 4×4, 4×6) అర్ధశతకాలతో పోరాడారు.
ఈ నేపథ్యంలో సునీల్ నరైన్, రఘువంశీ బ్యాటింగ్‌ను కొనియాడుతూ సూర్యకుమార్ సోషల్‌మీడియాలో స్టోరీస్ పెట్టాడు. 'నరైన్‌ను చూస్తుంటే సంతోషంగా ఉంది. కొంచెం స్మైల్ ఇవ్వు బ్రదర్', 'రఘవంవీ అరంగేట్రం అదిరిపోయింది. అతని ఇన్నింగ్స్‌ను కేకేఆర్ టీమ్ ప్రశంసించడాన్ని చూడటం ఎంతో ఆహ్లాదంగా ఉంది' అని సూర్య పేర్కొన్నాడు. 18 ఏళ్ల రఘవంశీ ఇటీవల ఆర్సీబీ మ్యాచ్‌తోనే ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాడు. కానీ ఆ మ్యాచ్‌లో బ్యాటింగ్ రాలేదు.