రోడ్డు ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన టీమిండియా వికెట్ కీపర్, ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్ తిరిగి మైదానంలో అడుగుపెట్టాడు. ఐపీఎల్‌తో రీఎంట్రీ ఇచ్చాడు. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఫర్వాలేదనిపించిన పంత్ గత రెండు మ్యాచ్‌ల్లో వరుస అర్ధశతకాలతో హోరెత్తిస్తున్నాడు. మునపటి పంత్‌ను గుర్తు చేస్తూ ధనాధన్ షాట్లు ఆడుతున్నాడు.
వైజాగ్ వేదికగా నిన్న కోల్‌కతా నైట్ రైడర్స్ మ్యాచ్‌లో పంత్ 25 బంతుల్లో 55 పరుగులు చేశాడు. నాలుగు ఫోర్లు, అయిదు సిక్సర్లు బాదాడు. అయితే మ్యాచ్ ముగిసిన అనంతరం పంత్‌తో కలిసి కేకేఆర్ సహయజమాని షారుక్ ఖాన్ ముచ్చటించాడు. పంత్ ఆరోగ్య పరిస్థితి గురించి షారుక్ అడిగి తెలుసుకున్నాడు. పంత్‌ను బాలీవుడ్ బాద్‌షా ఆప్యాయంగా కౌగిలుంచుకున్నాడు. యాక్సిడెంట్ అనంతరం గొప్పగా కోలుకుని తిరిగి బ్యాటు పట్టిన పంత్ పట్ల సంతోషం వ్యక్తం చేశాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

కాగా, మ్యాచ్ ముగిసిన అనంతరం మైదానంలో రింకూ సింగ్‌తో పంత్ నేల మీద కూర్చొని మాట్లాడాడు. ఈ సమయంలో పంత్ కోసం షారుక్ ఖాన్ ప్రత్యేకంగా వచ్చాడు. షారుక్‌ను గమనించిన పంత్ లేచి వస్తుండగా, ఫర్వాలేదు కూర్చొమని బాలీవుడ్ స్టార్ హీరో సింబాలిక్‌గా చెప్పాడం విశేషం. అయితే అప్పటికే పంత్ లేచి షారుక్ దగ్గరకు వచ్చాడు. పంత్‌తో పాటు ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాళ్ల అందరితో కలిసి షారుక్ ఖాన్ కాసేపు మాట్లాడారు. ఈ నేపథ్యంలో షారుక్ ఖాన్‌పై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నాడు. ఎలాంటి అహం లేకుండా షారుక్ చాలా హుందాగా ప్రవర్తించడం సూపర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 272 పరుగులు చేసింది. ఐపీఎల్ చరిత్రలో ఇదే రెండో అత్యధిక స్కోరు. సునీల్ నరైన్ (85; 39 బంతుల్లో 7×4, 7×6) విధ్వంసం సృష్టించాడు. రఘువంశీ (54; 27 బంతుల్లో 5×04, 3×6), రసెల్ (41; 19 బంతుల్లో 4×4, 3×6), రింకూ సింగ్ (26; 8 బంతుల్లో 4×4, 3×6) చెలరేగారు. నోకియా మూడు (3/59), ఇషాంత్ (2/43) వికెట్లు తీశారు.
అనంతరం ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ 17.2 ఓవర్లలో 166 పరుగులకే కుప్పకూలింది. రిషభ్ పంత్ (55; 25 బంతుల్లో 4×4, 5×6), ట్రిస్టియన్ స్టబ్స్ (54; 32 బంతుల్లో 4×4, 4×6) అర్ధశతకాలతో పోరాడారు. వైభవ్ అరోరా (3/27), వరుణ్ చక్రవర్తి (3/33) చెరో మూడు వికెట్లు,మిచెల్ స్టార్క్ (2/25) రెండు వికెట్లు సాధించారు.