వైజాగ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ పరుగుల సునామీ సృష్టించింది. బౌండరీల మోత మోగిస్తూ ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లను కేకేఆర్ బ్యాటర్లు నిస్సహాయులుగా మార్చారు. బుధవారం ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా 106 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ సీజన్‌లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో గెలిచి పాయింట్స్ టేబుల్‌లో టాప్‌లో నిలిచింది.
తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 272 పరుగులు చేసింది. ఐపీఎల్ చరిత్రలో ఇదే రెండో అత్యధిక స్కోరు. సునీల్ నరైన్ (85; 39 బంతుల్లో 7×4, 7×6) విధ్వంసం సృష్టించాడు. రఘువంశీ (54; 27 బంతుల్లో 5×04, 3×6), రసెల్ (41; 19 బంతుల్లో 4×4, 3×6), రింకూ సింగ్ (26; 8 బంతుల్లో 4×4, 3×6) చెలరేగారు. నోకియా మూడు (3/59), ఇషాంత్ (2/43) వికెట్లు తీశారు.

అనంతరం ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ 17.2 ఓవర్లలో 166 పరుగులకే కుప్పకూలింది. రిషభ్ పంత్ (55; 25 బంతుల్లో 4×4, 5×6), ట్రిస్టియన్ స్టబ్స్ (54; 32 బంతుల్లో 4×4, 4×6) అర్ధశతకాలతో పోరాడారు. వైభవ్ అరోరా (3/27), వరుణ్ చక్రవర్తి (3/33) చెరో మూడు వికెట్లు,మిచెల్ స్టార్క్ (2/25) రెండు వికెట్లు సాధించారు. విజయానంతరం కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాట్లాడాడు. తమ ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణా మైదానాన్ని ఎందుకు వీడాడో స్పష్టత లేదని, భుజాన్ని పట్టుకుని నొప్పితో బయటకు వెళ్లాడని చెప్పాడు.
''హర్షిత్‌కు ఏమైందో తెలియదు. భుజాన్ని పట్టుకుని మైదానాన్ని వీడాడు. అతని గురించి తెలుసుకుంటాం. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. మేం 210-220 పరుగులు సాధిస్తామనుకున్నాం. కానీ 270+ పరుగులు చేయడం బాగుంది. SRH రికార్డు (277 రన్స్) బ్రేక్ అవ్వాలని అనుకోలేదు. పవర్‌ప్లేలో హిట్టింగ్ చేస్తూ ఇన్నింగ్స్‌కు శుభారంభాన్ని ఇవ్వడమే సునీల్ నరైన్ కర్తవ్యం. అతడు విఫలమైనా సమస్య ఏమీ లేదు. మ్యాచ్‌కు ముందు కూడా ఈ విషయాన్ని చెప్పాను''
''రఘవంశీ తొలి బంతి నుంచే నిర్భయంగా ఆడాడు. అతని అసాధారణంగా ఆడాడు. రఘువంశీ ఆడే షాట్లను చూడటానికి ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన వైభవ్ అరోరా కీలక వికెట్లు సాధించాడు. ఈ మ్యాచ్‌లో మేం పైచేయి సాధించేలా చేశాడు. బౌలర్లు ముందుకు తమ బాధ్యతలు గొప్పగా నిర్వర్తించడం చాలా బాగుంది. ఒకరి సక్సెస్‌ను మరొకరు ఆస్వాదిస్తున్నారు'' అని శ్రేయస్ అయ్యర్ పేర్కొన్నాడు.