Ravindra Jadeja: ఐపీఎల్ 2024 సీజన్‌లో బోణీ కొట్టింది చెన్నై సూపర్ కింగ్స్. తొలి మ్యాచ్‌తోనే తన జైత్రయాత్రను ఆరంభించింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఆరు వికెట్ల తేడాతో మట్టికరిపించి.. తిరుగులేని విజయాన్ని అందుకుంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది.
చెన్నై చెపాక్ స్టేడియంలో శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో టాస్ ఓడిపోయి తొలుత బౌలింగ్ ఎంచుకున్న చెన్నై సూపర్ కింగ్స్ ధాటికి ఆర్సీబీ బ్యాటింగ్ ఆర్డర్ నిలవలేకపోయింది. వరుసగా వికెట్లను కోల్పోయింది. ప్రారంభ ఓవర్లల్లో తడబడ్డ బౌలర్లు ఆ తరువాత రిథమ్‌ను అందిపుచ్చుకున్నారు. టాప్ ఆర్డర్ బ్యాటింగ్‌ను కుప్పకూల్చారు.

నిర్ణీత 20 ఓవర్లల్లో ఆరు వికెష్ట నష్టానికి ఆర్సీబీ 173 పరుగులు చేసింది. లోయర్ ఆర్డర్ బ్యాటర్లు అనూజ్ రావత్, దినేష్ కార్తీక్ డెత్ ఓవర్లల్లో విజృంభించడంతో పోరాడ దగ్గ పరుగులను చేయగలిగింది ఆర్సీబీ. 25 బంతుల్లో నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లతో అనూజ్ రావత్- 48 పరుగులు చేసి చివర్లో అవుట్ అయ్యాడు.
ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడిన దినేష్ కార్తీక్ 26 బంతుల్లో 38 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఇందులో మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. ఆర్సీబీ నిర్దేశించిన టార్గెట్‌ను 18.4 ఓవర్లలోనే ఛేదించింది చెన్నై సూపర్ కింగ్స్. నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి 176 పరుగులు చేసింది.
ఇంకా ఎనిమిది బంతులు మిగలివుండగానే లక్ష్యాన్ని కొట్టి అవతల పడేసింది చెన్నై సూపర్ కింగ్స్. ఛేజింగ్‌లో తనకు ఎదురులేదని మరోసారి నిరూపించుకుంది. సూపర్ కింగ్స్ బ్యాటర్లందరూ సమష్టిగా రాణించారు. లోయర్ ఆర్డర్ మరింత బలంగా ఉందని ఈ మ్యాచ్‌తో రుజువైంది. రవీంద్ర జడేజా, శివం దుబే కలిసి అయిదో వికెట్‌కు అజేయంగా 66 పరుగులను జోడించారు.
ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా తన ప్రత్యేకతను చాటుకున్నాడీ మ్యాచ్‌తో. లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు దిగిన ఈ లెఫ్ట్ హ్యాండర్.. మరోసారి నాటౌట్‌గా నిలిచాడు. ఐపీఎల్‌లో ఛేజింగ్ ఇన్నింగ్‌లో నాటౌట్‌గా మ్యాచ్ ముగిసేంత వరకూ క్రీజ్‌లో పాతుకుపోవడం అతని స్పెషాలిటీ. ఇలా 27 సార్లు అతను నాటౌట్‌గా నిలిచాడు. అందులో ధోనీతో కలిసి క్రీజ్‌ను పంచుకున్న ఇన్నింగ్సే అధికం.