IPL 2024: ఈ సాలా కప్ నమ్దే అంటూ ప్రతి సంవత్సరం ఊరిస్తూ వచ్చిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. ఈ ఐపీఎల్ 2024 సీజన్‌ను ఓటమితో ఆరంభించింది. అభిమానులను ఉసూరుమనిపించింది. ఛాంపియన్ తరహా ఆటతీరును ప్రదర్శించలేకపోయింది. తొలుత బ్యాటింగ్, ఆ తరువాత బౌలింగ్‌లో ఘోరంగా విఫలమైంది.
ఆరు వికెట్లతో..
చెన్నై చెపాక్ స్టేడియంలో శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో లోకల్ టీమ్ చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఆరు వికెట్ల తేడాతో మట్టికరిచింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ- ప్రారంభ ఓవర్లల్లో ధాటిగా ఆడినా.. ఆ తరవాత చతికిలపడింది. చెన్నై బౌలర్ల ధాటికి టాప్, మిడిలార్డర్ బ్యాటింగ్ కుప్పకూలింది.

బ్యాటర్లే అనుకుంటే..
లోయర్ ఆర్డర్ బ్యాటర్లు అనూజ్ రావత్, వెటరన్ దినేష్ కార్తీక్ ప్రతిఘటించడంతో పోరాడదగ్గ స్కోరును చేయగలిగింది. దాన్నీ కాపాడుకోవడంలో విఫలమైంది. ఏ దశలో కూడా ఆర్సీబీ బౌలర్లు ప్రత్యర్థి బ్యాటర్లను ఒత్తిడిలోకి నెట్టలేకపోయారు. అటు బ్యాటర్లు, ఇటు బౌలర్లు సమష్టిగా చేతులెత్తేశారు.
టాస్ గెలవడంతోనే..
ఈ ఓటమికి టాస్ గెలవడంతోనే బీజం పడినట్టయింది. సాధారణంగా టీ20 ఫార్మట్‌లో టాస్ గెలిచిన జట్టు కేప్టెన్.. తొలుత ఫీల్డింగ్ చేయడానికే మొగ్గు చూపుతుంటాడు. ఆర్సీబీ కేప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ దీనికి భిన్నమైన నిర్ణయాన్ని తీసుకున్నాడు. తన బౌలర్లపై ఉన్న నమ్మకంతో తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దానికి తగ్గ మూల్యాన్ని చెల్లించుకున్నాడు.
టాప్ ఆర్డర్ విఫలం..
ఆర్సీబీ టాప్ ఆర్డర్ బ్యాటింగ్ దారుణం. తొలి ఆరు ఓవర్లలోనే వరుస వికెట్లు పడటం వారి అధ్వాన్నపు ఆటతీరుకు అద్దం పట్టినట్టయింది. అపారమైన అనుభవం ఉన్న ఫాఫ్ డుప్లెసిస్, విరాట్ కోహ్లీ, గ్లెన్ మ్యాక్స్‌వెల్.. సమయానుకూలంగా ఆడలేకపోయారు. క్రీజ్‌లో నిలవలేకపోయారు. ప్రారంభ ఓవర్లల్లో ధాటిగా ఆడిన ఫాఫ్, కోహ్లీ.. కొద్దిగా సంయమనం పాటించి ఉంటే క్రీజ్‌లో నిలదొక్కుకునే వాళ్లు. ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ గోల్డెన్ డకౌట్.. టాప్ ఆర్డర్ రిథమ్‌ను దెబ్బకొట్టింది.
చేతులెత్తేసిన బౌలర్లు..
బ్యాటింగ్ తరహాలోనే బౌలింగ్ కూడా. కామెరాన్ గ్రీన్ మినహా మరెవరూ కూడా బ్యాటర్లను కట్టడి చేయలేకపోయారు. ఎక్స్‌పీరియన్స్డ్ బౌలర్ మహ్మద్ సిరాజ్ ఈ మ్యాచ్‌లో ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో 38 పరుగులు ఇచ్చుకున్నాడు. 9.50 ఎకానమీని రికార్డ్ చేశాడు.
కేప్టెన్సీ వైఫల్యం..
దక్షిణాఫ్రికాకు చెందిన ఫాఫ్ డుప్లెసిస్‌కు కేప్టెన్సీ అనుభవం ఉంది. తన దేశ జాతీయ జట్టుకూ చెప్పుకోదగ్గ విజయాలను అందించాడీ ఓపెనర్. ఇక్కడ అతను తీసుకున్న నిర్ణయాలు రాంగ్ జడ్జ్‌మెంట్ అయ్యాయి. బౌలర్లను మార్చడంలో వైవిధ్యాన్ని చూపలేకపోయాడు. ఏకంగా ఏడుమంది బౌలర్లను ప్రయోగించినప్పటికీ సానుకూల ఫలితాన్ని రాబట్టలేకపోవడమే దీనికి నిదర్శనం.