ఐపీఎల్-2024లో కీలక సమరానికి సన్‌రైజర్స్ హైదరాబాద్ సిద్ధమైంది. ఫైనల్ బెర్తు కోసం క్వాలిఫయిర్-2లో రాజస్థాన్ రాయల్స్‌తో తలపడనుంది. ఇవాళ చెన్నైలోని చెపాక్ వేదికగా ఈ హోరాహోరీ పోరు జరగనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టు చెపాక్ వేదికగానే ఆదివారం జరగనున్న టైటిల్ పోరులో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో పోటీపడుతుంది.
అయితే ఈ సీజన్‌లో అదిరే విజయాలు, రికార్డు స్కోరులతో రెండో స్థానంలో నిలిచిన సన్‌రైజర్స్‌కు క్వాలిఫయిర్-1లో చుక్కెదురైంది. కేకేఆర్ చేతిలో ఓడింది. ఈ పరాజయంతో కొన్ని పాఠాలు నేర్చుకున్న ఎస్‌ఆర్‌హెచ్ బలమైన రాజస్థాన్‌ను ఢీ కొననుంది. మరోవైపు లీగ్ దశ ఆఖర్లో వరుసగా ఓటములు చవిచూసిన రాజస్థాన్ రాయల్స్ కీలక ఎలిమినేటర్ మ్యాచ్‌లో జూలు విదిల్చింది. ఆర్సీబీని ఓడించి సన్‌రైజర్స్‌తో సమరానికి సిద్ధమైంది.

కాగా, గణాంకాల పరంగా చెపాక్ మైదానం సన్‌రైజర్స్ హైదరాబాద్ కంటే రాజస్థాన్ రాయల్స్‌కే ఎక్కువగా అనుకూలంగా ఉంది. ఈ మైదానంలో ఎస్ఆర్‌హెచ్ ఆడిన పది మ్యాచ్‌ల్లో కేవలం ఒకే విజయం సాధించింది. మరోవైపు రాజస్థాన్ తొమ్మిదింట్లో రెండు సార్లు గెలిచింది. అయితే ఆర్సీబీ సెంటిమెంట్ ప్రకారం సన్‌రైజర్స్‌దే విజయం. ఎలా అంటే?
ఐపీఎల్ చరిత్ర పరంగా.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును టోర్నీ నుంచి నాకౌట్ చేసిన జట్టు ట్రోఫీని సాధించలేదు. 2010లో ప్లేఆఫ్స్‌లో ముంబై ఇండియన్స్ గెలిచి ఆర్సీబీని ఇంటికి పంపింది. కానీ ఫైనల్‌లో ముంబై ఓడి టైటిల్‌ను చేజార్చుకుంది. 2015లో చెన్నై సూపర్ కింగ్స్‌కు అదే పరిస్థితి ఎదురైంది. 2020 సీజన్‌లో ఆర్సీబీనీ ఓడించిన ఎస్‌ఆర్‌హెచ్ క్వాలిఫయిర్-2లోనే ఓడింది. అలాగే 2021, 2022 సీజన్లలో బెంగళూరును చిత్తుచేసిన కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్‌ను దురదృష్టం వెంటాడింది. ఫైనల్‌లో ఓడి కప్‌ను చేజార్చుకున్నాయి.
ఈ సెంటిమెంట్ 2024 సీజన్‌లోనూ రిపీట్ అవుతుందని, ప్లేఆఫ్స్ ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఆర్సీబీని ఓడించిన రాజస్థాన్ రాయల్స్‌కు అదే పరిస్థితి తలెత్తుందని ఆరెంజ్ ఆర్మీ భావిస్తోంది. క్వాలిఫయిర్-2లోనే రాజస్థాన్ ఓటమిపాలై చరిత్రను కొనసాగిస్తుందని ఆశిస్తుంది. సన్‌రైజర్స్‌ను ఫైనల్‌కు చేర్చడంలో ఆర్సీబీ పరోక్షంగా సాయం చేస్తుందని నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. అయితే ఆర్సీబీ సెంటిమెంట్ ప్రకారం రాజస్థాన్ టైటిల్ సాధించలేదని, కానీ క్వాలిఫయిర్-2లోనే ఓటమిపాలయ్యేలా హిస్టరీ లేదని మరికొందరు అంటున్నారు.