ముంబై ఇండియన్స్ జట్టుపై వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ బ్రియాన్ లారా తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. వాళ్ల ఆటగాళ్లపై కంటే ప్రత్యర్థి ప్లేయర్ల బలాలపైనే ముంబై ఇండియన్స్ ఎక్కువగా నమ్మతుందని లారా విమర్శించాడు. బౌలింగ్ విభాగంలో బుమ్రా ఒంటరియ్యాడని, ఇతర బౌలర్ల నుంచి ముంబై జట్టుకి సహకారం లభించట్లేదని అభిప్రాయపడ్డాడు.
వాంఖడే వేదికగా ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 20 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 206 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్ (69; 40 బంతుల్లో, 5x 4, 5x6), శివమ్ దూబె (66*; 38 బంతుల్లో, 10x4, 2x6) అర్ధశతకాలతో సత్తాచాటారు. ఆఖరి ఓవర్లో క్రీజులోకి వచ్చిన ఎంఎస్ ధోనీ (20*; 4 బంతుల్లో, 3x6) సిక్సర్లతో విరుచుకుపడ్డాడు.

అనంతరం ముంబై ఇండియన్స్ 20 ఓవర్లకు ఆరు వికెట్లు కోల్పోయి 186 పరుగులే చేసింది. రోహిత్ శర్మ (105*; 63 బంతుల్లో, 11x4, 5x6) అజేయ శతక పోరాటం వృథాగా మారింది. తిలక్ వర్మ (31; 20 బంతుల్లో, 5x4) సెకండ్ టాప్ స్కోరర్. పతిరన నాలుగు ఓవర్లలో 28 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు.
అయితే ఈ మ్యాచ్ గురించి మాట్లాడుతూ ముంబై ఇండియన్స్ బౌలింగ్ లోపాల్ని లారా వివరించాడు. సీఎస్కే బ్యాటర్ శివమ్ దూబె సామర్థ్యాన్ని నమ్మి, తమ స్పిన్నర్లకు అవకాశాన్ని ఇవ్వకపోవడాన్ని లారా తప్పుపట్టాడు. మహ్మద్ నబీ మూడు ఓవర్లు వేసి 19 పరుగులు, శ్రేయస్ గోపాల్ ఒక ఓవర్‌లో 9 పరుగులిచ్చి ఓ వికెట్ పడగొట్టాడు. కానీ స్పిన్‌లో దూబె చెలరేగుతాడని ఉద్దేశంతో స్పిన్నర్లతో ఎక్కువ ఓవర్లు బౌలింగ్ చేయించలేదు.
''జస్‌ప్రీత్ బుమ్రా మినహా ముంబై ఇండియన్స్ బౌలింగ్ పేలవంగా ఉంది. బౌలింగ్ విభాగంలో బుమ్రా మినహా ఇతర బౌలర్లు జట్టుకు మద్దతు ఇవ్వలేకపోతున్నారు. దాన్ని సీఎస్కే బ్యాటర్లు సద్వినియోగం చేసుకున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో స్పిన్నర్లు ఏడు ఎకానమీ రేటుతో పొదుపుగా బౌలింగ్ చేసినప్పటికీ నాలుగు ఓవర్లే బౌలింగ్ చేశారు. దూబె క్రీజులో ఉన్నాడని స్పిన్నర్లను నమ్మలేదు. ఈ విషయంలో ముంబై ఇండియన్స్ మెరుగవ్వాలి. మ్యాచ్ విన్నింగ్ బౌలర్లను వెతకాలి'' అని లారా తెలిపాడు.