కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు బిగ్ షాక్. అతనిపై ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ రూ.12 లక్షల భారీ జరిమానా విధించింది. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ స్లో ఓవర్ రేట్‌తో బౌలింగ్ చేయడంతో ఆ జట్టు కెప్టెన్ శ్రేయస్‌పై కొరడా ఝుళిపించింది. ఈ సీజన్‌లో శ్రేయస్‌కు ఇదే తొలి జరిమానా.
''ఐపీఎల్ నియమావళిలోని కనీస ఓవర్ రేట్ నిబంధనల ప్రకారం కేకేఆర్ చేసిన తొలి నేరం కావడంతో శ్రేయస్ అయ్యర్‌కు రూ.12 లక్షల జరిమానా విధించాం'' అని ఐపీఎల్ నిర్వాహకులు ఓ ప్రకటనలో తొలిపారు. స్లో ఓవర్‌రేట్ నేరాన్ని రెండో సారి చేస్తే కెప్టెన్‌తో పాటు జట్టులో ఆటగాళ్లపై కూడా ఫైన్ విధిస్తారు. మూడో సారి విధిస్తే కెప్టెన్‌పై సస్పెన్షన్ వేటు కూడా పడే ప్రమాదం ఉంటుంది. ఈ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్ అత్యధికంగా రెండు సార్లు జరిమానాకు గురయ్యాడు. తొలిసారి రూ.12 లక్షలు, రెండోసారి రూ.24 లక్షల ఫైన్ కట్టాడు.

కాగా, రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓటమిపాలైన కోల్‌కతా నైట్ రైడర్స్‌కు, కెప్టెన్‌పై జరిమానా పడటం మరో షాక్‌గా మారింది. 223 పరుగుల భారీ స్కోరు సాధించినప్పటికీ కేకేఆర్ మ్యాచ్‌ను కాపాడుకోలేకపోయిన విషయం తెలిసిందే. ఈడెన్‌గార్డెన్స్ వేదికగా రాజస్థాన్‌తో జరిగిన ఉత్కంఠ భరిత మ్యాచ్‌లో కోల్‌కతా రెండు వికెట్ల తేడాతో పరాజయాన్ని చేసింది.
ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ పోరులో తొలుత కేకేఆర్ బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవరల్లో ఆరు వికెట్లకు 223 పరుగులు చేసింది. సునీల్ నరైన్ (109; 56 బంతుల్లో, 13x4, 6x6) సెంచరీతో సత్తాచాటాడు. అనంతరం ఛేదనలో రాజస్థాన్ రాయల్స్ ఎనిమిది వికెట్లు కోల్పోయి చివరి బంతికి సింగిల్ తీసి విజయం సాధించింది. బట్లర్ (107*; 67 బంతుల్లో, 9x4, 6x6) అజేయ శతకంతో చెలరేగాడు.