డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌కు వరుసగా షాక్‌లు తగులుతున్నాయి. ఐపీఎల్ 17వ సీజన్ ప్రారంభంకాక ముందే మరో సీఎస్‌కే ప్లేయర్ గాయపడ్డాడు. రూ. 2 కోట్లు వెచ్చించి వేలంలో కొనుగోలు చేసిన ముస్తాఫిజుర్ రెహ్మాన్ స్ట్రెచర్ మీద మైదానాన్ని వీడే పరిస్థితి ఎదుర్కొన్నాడు.
శ్రీలంకతో జరుగుతున్న మూడో వన్డేలో బంగ్లాదేశ్ సీనియర్ పేసర్ ముస్తాఫిజు రెహ్మాన్ గాయపడ్డాడు. అతని తొడ కండరాలు పట్టేశాయి. నొప్పితో విలవిలలాడిన అతడు స్ట్రెచర్‌పై మైదానాన్ని వీడాడు. అయితే అతడి గాయం తీవ్రత గురించి ఇంకా పూర్తి వివరాలు తెలియలేదు. కానీ మార్చి 22న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరగనున్న ప్రారంభ మ్యాచ్‌కు ముస్తాఫిజుర్ దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

ఒకవేళ ముస్తాఫిజుర్ గాయం తీవ్రమైనదైతే అతడు మరిన్ని మ్యాచ్‌లకూ దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు న్యూజిలాండ్ ప్లేయర్ డెవాన్ కాన్వే, శ్రీలంక పేసర్ మథీశ పతిరన కూడా గాయపడిన విషయం తెలిసిందే. తొలి ఫేజ్ మ్యాచ్‌లకు వీరిద్దరు దూరమయ్యారు. వేలు గాయంతో కాన్వే, ఎడమతొడ కండరాల సమస్యతో పతిరన ఆటకు దూరమయ్యారు. అయితే మిగిలిన మ్యాచ్‌లకు అయినా వీరిద్దరు సీఎస్‌కే జట్టుతో చేరతారనే విషయంపై స్పష్టత లేదు.
కాగా, జూన్‌లో టీ20 ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై అన్ని దేశాల క్రికెట్ బోర్డులు దృష్టిసారించాయి. దీంతో పూర్తిగా ఫిట్‌నెస్ సాధిస్తేనే లీగ్‌లో పాల్గొనడానికి కాన్వే, పతిరన, ముస్తాఫిజుర్‌కు ఆయా దేశాల బోర్డులు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నాయి. గత సీజన్‌లో సీఎస్‌కే ఛాంపియన్‌గా నిలవడంలో కాన్వే కీలకపాత్ర పోషించాడు. 16 మ్యాచ్‌ల్లో 672 పరుగులు చేశాడు. ఫైనల్‌లో దూకుడుగా 47 రన్స్ చేశాడు. ఈ సీజన్‌లో కాన్వే పాల్గొనడంపై అనిశ్చితి నెలకొనడం సీఎస్‌కేకు ప్రతికూలాంశమే.
చెన్నై సూపర్ కింగ్స్:
రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, అజింక్య రహానె, ఎంఎస్ ధోని (కెప్టెన్), రవీంద్ర జడేజా, శివమ్ దూబే, మొయిన్ అలీ, అజయ్ మండల్, నిశాంత్ సింధు, మిచెల్ శాంట్నర్, తీక్షణ, ప్రశాంత్ సోలంకి, దీపక్ చాహర్, మథీశ పతినర, రాజవర్థన్, ముకేశ్ చౌదరి, తుషార్ దేశ్‌పాండే, సిమర్‌జీత్ సింగ్, షేక్ రషీద్, డారిల్ మిచెల్, సమీర్ రిజ్వీ, ముస్తాఫిజుర్ రెహ్మన్, రచిన్ రవీంద్ర, శార్దూల్ ఠాకూర్, అరవెల్లి అవనీష్