ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ ఐపీఎల్ వేలం చరిత్రలో ఆల్‌టైమ్ రికార్డు ధర పలికిన విషయం తెలిసిందే. స్టార్క్ కోసం వేలంలో గుజరాత్ టైటాన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ తీవ్రంగా పోటీపడ్డాయి. చివరికి కోల్‌కతా రూ.24.75 కోట్లు చెల్లించింది. అయితే స్టార్క్‌పై భారీ మొత్తం వెచ్చించడానికి కారణాలు ఉన్నాయని కేకేఆర్ మెంటార్ గౌతమ్ గంభీర్ తెలిపాడు.
''స్టార్క్ X-ఫ్యాక్టర్. అందులో ఎలాంటి సందేహం లేదు. అతడు కొత్త బంతితో పాటు డెత్ ఓవర్లలో సత్తా చాటగలడు. అంతేగాక బౌలింగ్ దళానికి నాయకత్వం వహిస్తాడు. అలాగే మా భారత యువ బౌలర్లకు మార్గనిర్దేశకం చేయగలడు. కేవలం బౌలింగ్ కోసమే అతడిని దక్కించుకోలేదు. అతడిలో ఈ నైపుణ్యాలను చూసే ఖర్చు పెట్టాం''

''పటిష్టమైన బౌలింగ్ దళం ఉండాలని భావించేవాళ్లం. ఇప్పుడు మా బౌలింగ్ బలోపేతంగా ఉంది. మాకు చాలా ఆప్షన్లు వచ్చాయి. ముజీబ్ రెహ్మాన్, అట్కిన్సన్, సునీల్ నరైన్, మిచెల్ స్టార్క్‌తో పాటు చేతన్ సకారయా, ఇద్దరు సీమర్లు హర్షిత్ రానా, సుయాశ్ శర్మ ఉన్నారు. బలమైన బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్ కూడా మా జట్టులో ఉంది. దీంతో మ్యాచ్ జరిగే వేదికలకు తగ్గట్టుగా తుదిజట్టును ఎంచుకుంటాం'' అని గంభీర్ అన్నాడు.
''నా దృష్టిలో కేకేఆర్ జట్టు మాత్రమే కాదు, ఓ ఎమోషన్. ఏడేళ్లు కోల్‌కతా ఫ్యాన్స్ నుంచి గొప్ప ప్రేమను పొందాను.2012, 2014 సీజన్ జ్ఞాపకాలను మరోసారి రిపీట్ చేయడానికి ప్రయత్నిస్తాం'' అని గంభీర్ చెప్పాడు. 2012, 2014 సీజన్లలో కోల్‌కతా ఛాంపియన్‌గా నిలిచింది.
కాగా, వేలంలో కోల్‌కతా నైట్ రైడర్స్ స్టార్క్ (రూ. 24.75 కోట్లు), ముజీబ్ రెహ్మాన్ (రూ. 2 కోట్లు), రూథర్‌ఫర్డ్ (రూ. 1.50 కోట్లు), అట్కిన్సన్ (రూ. 1 కోటి), మనీశ్ పాండే (రూ.50 లక్షలు), కేఎస్ భరత్ (రూ.50 లక్షలు), చేతన్ సకారియా (రూ.50 లక్షలు), రఘువన్షీ (రూ.20 లక్షలు), రమణ్‌దీప్ (రూ.20 లక్షలు), షకిబ్ హుస్సేన్ (రూ.20 లక్షలు).