ఐపీఎల్ హీట్ మొదలైంది. ఏ ఆటగాడు ఏ జట్టులోకి వెళ్తాడు? గత వేలం రికార్డులు బద్దలవుతాయా? అధిక ధర ఏ ప్లేయర్ పలుకుతాడు? అనే ప్రశ్నలకు మరికొన్ని గంటల్లో సమాధానం దొరకనుంది. భారత ప్లేయర్లు శార్దూల్ ఠాకూర్, హర్షల్ పటేల్; విదేశీ సీనియర్లు మిచెల్ స్టార్క్, కమిన్స్‌తో పాటు యువ ప్లేయర్లు రచిన్ రవీంద్ర, గెరాల్డ్ కొయెట్జీకి భారీ డిమాండ్ ఉంటుందని అంచనా వేస్తున్నారు.
మరికాసేపట్లో ఐపీఎల్ ప్రారంభం కానున్న నేపథ్యంలో దక్షిణాఫ్రికా యువ సంచలనం కొయెట్జీ కీలక వ్యాఖ్యలు చేశాడు. తనకి చెన్నై సూపర్ కింగ్స్‌కు వెళ్లాలని ఉందని, ఎంఎస్ ధోనీ సారథ్యంలో ఆడాలని ఉందని తన మనసులో మాట చెప్పాడు.

'' వేలంలో అంతిమంగా ధోనీ జట్టులోకి వెళ్తే ఎంతో బాగుంటుంది. అత్యుత్తమ కెప్టెన్లలో ఒకరైన ధోనీ సారథ్యంలో ఆడటం గొప్ప అవకాశం. ఎంతో నేర్చుకోవచ్చు. అపార అనుభవాన్ని సంపాదించుకోవచ్చు. సూపర్ కింగ్స్ ఫ్యామిలీ ఎంతో స్పెషల్. అది పవర్‌ఫుల్, అద్భుతమైన ఫ్రాంచైజీ'' అని కొయెట్జీ అన్నాడు. కాగా, కొయెట్జీ టీమిండియాతో టెస్టు సిరీస్‌పై ఫోకస్ చేయడానికి వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు.
ఐపీఎల్-2024 వేలం దుబాయ్ వేదికగా ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ప్రారంభం కానుంది. స్టార్ స్పోర్ట్స్‌లో, జియో సినిమాలో లైవ్ చూడొచ్చు. ఈ వేలంలో 333 మంది ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. వీరిలో 214 మంది ఇండియన్ ప్లేయర్స్ కాగా, 119 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. ఖాళీలు 77 మాత్రమే ఉన్నాయి. ఇందులో 30 మంది విదేశీ ప్లేయర్లకు అవకాశం ఉంది.
తొలిసారి భారత్ వెలుపల వేలాన్ని నిర్వహించనున్నారు. మల్లిక సాగర్ ఆక్షనీర్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. 16 ఏళ్ల ఐపీఎల్ వేలం చరిత్రలో తొలిసారి మహిళ ఆక్షనీర్‌గా పాల్గొనడడం ఈ సారి ప్రత్యేకంగా నిలుస్తుంది.కాగా, అన్ని ఫ్రాంచైజీల కంటే గుజరాత్ టైటాన్స్ వద్ద అత్యధిక డబ్బు ఉంది.గుజరాత్ వద్ద రూ.38.15 కోట్లు ఉన్నాయి.