CSK vs RCB 2024: ఐపీఎల్ 2024 సీజన్‌లో బోణీ కొట్టింది చెన్నై సూపర్ కింగ్స్. తొలి మ్యాచ్‌తోనే తన జైత్రయాత్రను ఆరంభించింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఆరు వికెట్ల తేడాతో మట్టికరిపించి.. తిరుగులేని విజయాన్ని అందుకుంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది.
చెన్నై చెపాక్ స్టేడియంలో శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో టాస్ ఓడిపోయి తొలుత బౌలింగ్ ఎంచుకున్న చెన్నై సూపర్ కింగ్స్ ధాటికి ఆర్సీబీ బ్యాటింగ్ ఆర్డర్ నిలవలేకపోయింది. వరుసగా వికెట్లను కోల్పోయింది. ప్రారంభ ఓవర్లల్లో తడబడ్డ బౌలర్లు ఆ తరువాత రిథమ్‌ను అందిపుచ్చుకున్నారు. టాప్ ఆర్డర్ బ్యాటింగ్‌ను కుప్పకూల్చారు.

నిర్ణీత 20 ఓవర్లల్లో ఆరు వికెష్ట నష్టానికి ఆర్సీబీ 173 పరుగులు చేసింది. లోయర్ ఆర్డర్ బ్యాటర్లు అనూజ్ రావత్, దినేష్ కార్తీక్ డెత్ ఓవర్లల్లో విజృంభించడంతో పోరాడ దగ్గ పరుగులను చేయగలిగింది ఆర్సీబీ. 25 బంతుల్లో నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లతో అనూజ్ రావత్- 48 పరుగులు చేసి చివర్లో అవుట్ అయ్యాడు.
ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడిన దినేష్ కార్తీక్ చివరికి ఆర్సీబీకి ఆపద్బాంధవుడిగా మారాడు. 26 బంతుల్లో 38 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఇందులో మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. ఆర్బీసీ నిర్దేశించిన టార్గెట్‌ను 18.4 ఓవర్లలోనే ఛేదించింది చెన్నై సూపర్ కింగ్స్. ఎదురులేదని నిరూపించుకుంది.నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి 176 పరుగులు చేసింది. 15 బంతుల్లో మూడు సిక్సర్లు, మూడు ఫోర్లతో 37 పరుగులు బాదిన ఓపెనర్ రచిన్ రవీంద్ర టాప్ స్కోరర్. చివర్లో శివమ్ దుబే మెరుపు ఇన్నింగ్ ఆడాడు.
ఈ విజయంతో ఆర్సీబీపై ఓ సరికొత్త రికార్డును అందుకుంది చెన్నై సూపర్ కింగ్స్. తన హోమ్ గ్రౌండ్ చెపాక్ ఎంఏ చిదంబరం స్టేడియంలో వరుసగా ఎనిమిది మ్యాచ్‌లల్లో ఆర్సీబీని ఓడించింది. 2008 నుంచి ఇప్పటివరకు చెపాక్ స్టేడియంలో తొమ్మిదిసార్లు ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్‌లు జరిగాయి.
తొలి మ్యాచ్‌లో ఆర్సీబీ చేతిలో ఓడింది చెన్నై. ఇక అంతే. అప్పటి నుంచి ఇప్పటివరకు వరుసగా ఎనిమిదిసార్లు గెలుస్తూ వచ్చింది. 2009, 2009లో అయిదు వికెట్లు, 2011లో 21 పరుగులు, 2011 ఫైనల్స్‌లో 58 పరుగులు, 2012లో అయిదు వికెట్లు, 2013లో మూడు వికెట్లు, 2015లో 24 పరుగులు, 2019లో ఏడు వికెట్లతో గెలిచింది. ఇప్పుడు దాన్ని కొనసాగించింది. ఆరు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. చెపాక్‌లో తనకు తిరుగులేదని నిరూపించుకుంది.