ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అనగానే గుర్తొచ్చేది విరాట్ కోహ్లీనే కానీ. ఈ క్యాష్ రిచ్ లీగ్ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకే టీంకు ఆడుతున్న ప్లేయర్‌గా కోహ్లీకి రికార్డు ఉంది. మిగతా ఏ ఆటగాడూ మొదట్నుంచీ ఇలా ఒకే జట్టు తరఫున ఆడలేదు. అలాంటి కోహ్లీ.. ఒకానొక సమయంలో ఆర్సీబీని వదిలేయాలని అనుకున్నాడట. ఈ విషయాన్ని అతనే స్వయంగా చెప్పాడు.
జియో సినిమాలో మాజీ ప్లేయర్ రాబిన్ ఊతప్పకు కోహ్లీ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఐపీఎల్ మొదలైన తర్వాత రెండు, మూడేళ్లపాటు ఆర్సీబీలో తను 5-6 స్థానాల్లో బ్యాటింగ్ చేసే వాడినని గుర్తుచేశాడు. దాంతో తను పెద్దగా రాణించలేదన్నాడు. ఈ సమయంలోనే తనకు టాపార్డర్ అవకాశం ఇచ్చే జట్టు కోసం వెతికానని చెప్పాడు.

అలా ఒక ఫ్రాంచైజీతో మాట్లాడితే.. ససేమిరా అన్నారట. దీంతో కోహ్లీ వెనుతిగినట్లు చెప్పాడు. ఆ తర్వాత టీమిండియాలో మూడో స్థానంలో కోహ్లీ అదరగొట్టాడు. 2011లో రిటెన్షన్లకు ముందే కోహ్లీ ఫామ్ అందుకున్నాడు. ఈ సమయంలో ఆర్సీబీ యాజమాన్యం అతన్ని కలిసిందట. 'నిన్ను రిటైన్ చేసుకుంటున్నాం' అని చెప్పారట. అప్పుడు కోహ్లీ వాళ్లకు ఒకే ఒక షరతు పెట్టాడట.
'నేను టాపార్డర్‌లో బ్యాటింగ్ చేయాలని అనుకుంటున్నా. టీమిండియాలో మూడో స్థానంలో ఆడుతున్నా. కాబట్టి ఈ టీంలో కూడా అదే స్థానంలో ఆడతా' అని తేల్చేశాడు. దీనికి ఆర్సీబీ యాజమాన్యం ఒకే చెప్పడంతో ఆర్సీబీలో కొనసాగాడు. అదే సమయంలో కోహ్లీని కాదన్న ఫ్రాంచైజీ మళ్లీ అతన్ని సంప్రదించిందట. ఈ విషయాన్ని కోహ్లీనే స్వయంగా వెల్లడించాడు. 'మీరు వేలానికి రండి' అని అడిగారట.
ఆ ఫ్రాంచైజీ పేరు చెప్పడానికి ఇష్టపడని కోహ్లీ.. తను మాత్రం వారికి నిర్మొహమాటంగా నో చెప్పేశానని చెప్పాడు. 'నా అభిప్రాయానికి ఆర్సీబీలో విలువ ఇచ్చారు. ఇక్కడ నాకు గౌరవం ఉంది. అందుకే ఈ జట్టును వదలనని చెప్పేశా' అని గుర్తుచేసుకున్నాడు. కోహ్లీ వంటి ఆటగాడిని వద్దనుకోవడం ఆ ఫ్రాంచైజీ చేసిన పొరపాటు అని ఊతప్ప అన్నాడు. 'అప్పట్లో వాళ్లు డైరెక్ట్‌గా నా ప్రపోజల్‌కి నో చెప్పారు. అది వారి నిర్ణయం అని నేను గౌరవించా' అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.