ఐపీఎల్ కొత్త సీజన్‌ను వరుస ఓటములతో ప్రారంభించిన ముంబై ఇండియన్స్ అనూహ్యంగా ప్లేఆఫ్స్ చేరింది. సెకండ్ హాఫ్‌లో అద్భుతమైన ఛేజ్‌లతో వరుస విజయాలు సాధించిందీ జట్టు. అయితే బలహీనమైన బౌలింగ్ ఆ టీంను కొంత దెబ్బతీసింది. కొందరు ఆటగాళ్లు కూడా తమ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. ఈ క్రమంలో ముగ్గురు విదేశీ ఆటగాళ్లను ముంబై జట్టు రిలీస్ చేసేస్తుందని అనిపిస్తోంది.
డెవాల్డ్ బ్రెవిస్: ఈ సౌతాఫ్రికా కుర్రాడు అద్భుతమైన ఆటతో అందరి దృష్టినీ ఆకర్షించాడు. తన కెరీర్‌లో 44 టీ20లు ఆడిన అతను 141 స్ట్రైక్ రేటుతో 1055 పరుగులు చేశాడు. సౌతాఫ్రికాలో టైటాన్స్ తరఫున ఆడిన అతను కేవలం 57 బంతుల్లోనే 162 పరుగులు చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. 'బేబీ ఏబీ'గా పేరొందిన అతను గతేడాది ఐపీఎల్ అరంగేట్రం చేశాడు.

ఆ సీజన్‌లో ఏడు మ్యాచులు ఆడిన అతను తన సత్తా చూపించాడు. దీంతో అతన్ని ముంబై రిటైన్ చేసుకున్నా కూడా ఈ ఏడాది అతను ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయాడు. ముంబై ఫారెన్ ప్లేయర్ల కాంబినేషన్ ఆల్‌మోస్ట్ సెట్ అయిపోవడంతో అతనికి అవకాశం దక్కలేదు. ఈ క్రమంలో వచ్చే ఏడాది ఐపీఎల్ ముందు అతన్ని ముంబై రిలీజ్ చేసే అవకాశం కనిపిస్తోంది.
జోఫ్రా ఆర్చర్: ఐపీఎల్ 2022కు ముందు జోఫ్రా ఆర్చర్‌ను భారీ ధరకు ముంబై కొనుగోలు చేసింది. అప్పట్లో చాలా మంది ఈ కొనుగోలును తెగ మెచ్చుకున్నారు. అతను గాయంతో గతేడాది ఐపీఎల్‌కు అందుబాటులో ఉండడని తెలిసి కూడా భవిష్యత్తు కోసం ముంబై ఈ పెట్టుబడి పెట్టిందని భావించారు. ఆర్చర్ టీ20 గణాంకాలు కూడా బాగుండటంతో ముంబై ఫ్యాన్స్ కూడా సంతోషించారు.
ఈ ఏడాది బుమ్రా గైర్హాజరీలో ముంబై బౌలింగ్ ఎటాక్‌ను ఆర్చర్ ముందుండి నడిపిస్తాడని అంతా అనుకున్నారు. కానీ అతని గాయం తిరగబెట్టడంతో కేవలం ఐదు మ్యాచులే ఆడగలిగాడీ ఇంగ్లండ్ స్టార్. ఈ సీజన్‌లో ముంబైకి బౌలింగ్ ఎంత సమస్యగా మారిందో తెలిసిందే. ఈ క్రమంలో ఇంకెవరైనా ఫిట్‌గా ఉండే ప్లేయర్‌పై పెట్టుబడి పెట్టాలని ముంబై అనుకుంటోంది. అందుకే వచ్చే ఐపీఎల్‌కు ముందు ఆర్చర్‌ను రిలీజ్ చేసేయాలని అనుకుంటోందట.
క్రిస్ జోర్డాన్: టీ20 గణాంకాలు అంతగా బాగోకపోయినా కూడా ఆర్చర్‌కు రిప్లేస్‌మెంట్‌గా క్రిస్ జోర్డాన్‌ను ముంబై కొనుగోలు చేసింది. ఈ సీజన్‌లో జోర్డాన్ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాడు. కీలకమైన రెండో క్వాలిఫైయర్‌లో భారీగా పరుగులు ఇవ్వడమే కాకుండా ఇషాన్ కిషన్‌ను గాయపరిచాడు కూడా. మంచి డెత్ బౌలర్‌గా పేరున్న జోర్డాన్.. గణాంకాలు మాత్రం అంత గొప్పగా లేవు.
అతను 34 ఐపీఎల్ మ్యాచుల్లో 9.61 ఎకానమీతో బౌలింగ్ చేశాడు. ఈ ఏడాది ముంబై తరఫున ఆరు మ్యాచులు ఆడిన అతను కేవలం రెండు వికెట్లు మాత్రమే తీసుకున్నాడు. దానికితోడు అతని ఎకానమీ ఏకంగా 10.77గా ఉంది. ఇలాంటి ప్లేయర్‌ను తిరిగి రిటైన్ చేసుకోవాలని ముంబై అనుకోవడం లేదని సమాచారం. అందుకే అతన్ని కూడా మినీ వేలానికి ముందు వదిలేయాలని డిసైడ్ అయిందట.