రెండు నెలలపాటు క్రీడాభిమానులను ఉర్రూతలూగించిన ఐపీఎల్ ముగిసింది. ఈ సీజన్‌లో ఎన్నో ఉత్కంఠ భరిత మ్యాచులు ప్రేక్షకులను అలరించాయి. అదే సమయంలో ఎన్నో రికార్డులు కూడా బద్దలయ్యాయి. అత్యధిక సార్లు 200పైగా పరుగులు నమోదైంది కూడా ఇదే సీజన్‌లో కావడం గమనార్హం. ఈ ఏడాది ఐపీఎల్‌లో 37 సార్లు 200పైగా స్కోర్లు నమోదయ్యాయి.
ఇంతకుముందు ఎప్పుడూ ఇన్నిసార్లు 200పైగా స్కోర్లు ఐపీఎల్‌లో నమోదవలేదు. గతేడాది కూడా కేవలం 17 సార్లే 200 పైగా స్కోర్లు నమోదవడం గమనార్హం. అంటే ఈసారి దానికి రెట్టింపుసార్లు ఇంత భారీ స్కోర్లు నమోదయ్యాయన్నమాట. ఐపీఎల్ హిస్టరీలోనే అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ చేసిన బ్యాటర్‌గా యశస్వి జైస్వాల్ రికార్డు సృష్టించాడు. అతను కేవలం 13 బంతుల్లోనే అర్ధశతకం సాధించాడు.

అలాగే ఈ ఏడాది ఐపీఎల్ ఫైనల్ ఆడిన ఎంఎస్ ధోనీ.. ఐపీఎల్‌లో 250 మ్యాచులు ఆడిన తొలి ప్లేయర్‌గా రికార్డు సృష్టించాడు. అలాగే అంతర్జాతీయ అరంగేట్రం చేయకముందే ఐపీఎల్‌లో టాప్ స్కోరు చేసిన ప్లేయర్‌గా రజత్ పటీదార్ (112 నాటౌట్) రికార్డు చెరగలేదు. ఈ జాబితాలో గుజరాత్ టైటాన్స్ యువ బ్యాటర్ సాయి సుదర్శన్ (96) రెండో స్థానాన్ని ఆక్రమించాడు. చెన్నైతో జరిగిన ఫైనల్‌లో అతను అదరగొట్టాడు.
ఇదే మ్యాచులో హాఫ్ సెంచరీ బాదిన వృద్ధిమాన్ సాహా (54) ఐపీఎల్ చరిత్రలో హాఫ్ సెంచరీ బాదిన అత్యంత పెద్ద వయసున్న ప్లేయర్‌గా రికార్డు సృష్టించాడు. అతని వయసు 38 సంవత్సరాల 112 రోజుల వయసులో హాఫ్ సెంచరీ చేయడం గమనార్హం. గుజరాత్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ ఈ సీజన్‌లో ఏకంగా 13 సార్లు 30పైగా స్కోర్లు చేశాడు. ఒక ఐపీఎల్ సీజన్‌లో ఇన్ని సార్లు మరెవరూ 30+ స్కోర్లు చేయలేదు.
ఇంతకుముందు 2016లో విరాట్ కోహ్లీ (12), 2018లో కేన్ విలియమ్సన్ (12) ఈ జాబితాలో టాప్ ప్లేస్‌లో ఉండేవారు. ఇప్పుడు గిల్ ఆ స్థానాన్ని ఆక్రమించాడు. ఇక ఈ సీజన్‌లో ఏకంగా 12 సెంచరీలు నమోదయ్యాయి. వీటిలో గిల్ మూడు సెంచరీలు బాదగా.. విరాట్ కోహ్లీ రెండు శతకాలు చేశాడు. అలాగే ఈ ఏడాది ఐపీఎల్‌లో ఏకంగా 1124 సిక్సర్లు నమోదయ్యాయి. ఇప్పటి వరకు ఐపీఎల్ హిస్టరీలో ఇన్ని సిక్సర్లు ఎవరూ బాదలేదు.
ఈ ఐపీఎల్‌లో ఏకంగా 8 సార్లు 200పైగా స్కోర్లను ఛేజ్ చేశారు. ఇన్నిసార్లు మరెప్పుడూ 200+ టార్గెట్లను ఛేజ్ చేయలేదు. అలాగే ఐపీఎల్ ఫైనల్ గెలిచిన అంబటి రాయుడు.. ఐపీఎల్ ఫైనల్‌లో అత్యధిక విజయాల్లో పాలుపంచుకున్న ప్లేయర్‌గా నిలిచాడు. అతను ముంబై సారధి రోహిత్ శర్మ రికార్డును సమం చేశాడు. వీళ్లిద్దరూ ఆరుసార్లు ఐపీఎల్ ఫైనల్స్ గెలిచిన జట్టులో భాగస్వాములుగా ఉండటం గమనార్హం.

ఈ సీజన్‌లో అత్యధిక భాగస్వామ్యాలు కూడా నమోదయ్యాయి. ఈ సీజన్‌లో ఆర్సీబీ ఓపెనింగ్ జోడీ విరాట్ కోహ్లీ, ఫాప్ డుప్లెసిస్ ఏకంగా 939 పరుగులు చేశారు. ఇంతకుముందు ఈ రికార్డు ఆర్సీబీ స్టార్లు కోహ్లీ, డివిలియర్స్ పేరిట ఉండేది. వీళ్లిద్దరూ 2016లో 939 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ ఏడాది 183 సార్లు 50+ స్కోర్లు నమోదయ్యాయి. ఇంతకుముందు 2021లో 172 హాఫ్ సెంచరీలు నమోదవడమే రికార్డు. అది ఈ ఏడాది బద్దలైంది.