ఏ ఫార్మాట్ అయినా.. క్రికెట్‌లో కెప్టెన్ పాత్ర చాలా కీలకం. అతను ముందుండి జట్టును నడిపించాల్సి ఉంటుంది. కానీ కొందరు కెప్టెన్లు తమ చెత్త ఆటతీరుతో జట్టు మొమెంటం మొత్తాన్ని చెడగొట్టేస్తారు. ఈ ఐపీఎల్‌లో కూడా కొందరు కెప్టెన్లు ఇలాగే తమ జట్టుకు భారంగా మారారు. వాళ్ల వల్లనే ఆయా జట్లు తడబడుతున్నాయని అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి ఆ కెప్టెన్లు ఎవరంటే?
డేవిడ్ వార్నర్: ఈ ఏడాది ఐపీఎల్‌లో ఆరెంజ్ క్యాప్ కోసం పోటీ పడుతున్న వారిలో డేవిడ్ వార్నర్ ఒకడు. ఇప్పటి వరకు ఐదు మ్యాచులు ఆడిన అతను 234 పరుగులతో రాణించాడు. అయితే ఈ పరుగులను అతను 116 స్ట్రైక్ రేటుతో చేశాడు. ఎంత భారీ స్కోరును ఛేజ్ చెయ్యాలన్నా.. ప్రత్యర్థి ముందు భారీ స్కోరు నిలపాలన్నా.. ఓపెనర్‌గా వచ్చే వార్నర్ చాలా కీలకం. కానీ అతను మాత్రం తన జిడ్డు బ్యాటింగ్‌తో ఢిల్లీ క్యాపిటల్స్‌కు తలనొప్పిగా మారాడు. మిగతా జట్టు కూడా ఫామ్‌లో లేకపోవడంతో ఢిల్లీ వరుస ఓటములతో వెనుక బడింది.

కేఎల్ రాహుల్ : లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ కూడా ఈ ఏడాది ఆ జట్టుకు భారంగా మారాడు. టీ20 వరల్డ్ కప్‌లో చెత్తగా బ్యాటింగ్ చేశాడని విమర్శలు ఎదుర్కొన్న అతను.. ఆ తర్వాత భారత్ తరఫున ఒక్క టీ20 మ్యాచ్ కూడా ఆడలేదు. ఈ ఐపీఎల్‌లో రాణించి మళ్లీ భారత టీ20 జట్టులోకి పునరాగమనం చేయడం అతని లక్ష్యంగా ఉండాలి. కానీ ఈ ఐపీఎల్‌లో ఐదు మ్యాచుల్లో 155 పరుగులే చేశాడతను. దానికితోడు ఈ రన్స్‌ను 113 స్ట్రైక్ రేటుతో చేశాడు. ఈ ఐపీఎల్‌లో కనీసం 100 పరుగులు చేసిన వాళ్లలో ఇంత తక్కువ స్ట్రైక్ రేటుతో ఎవరూ ఆడలేదు. మిగతా బ్యాటర్లు రాణించడంతో లక్నో జట్టు బతికిపోతోంది.
హార్దిక్ పాండ్యా : గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా కూడా పెద్ద ఫామ్‌లో లేడు. గతేడాది ఆ జట్టు ట్రోఫీ నెగ్గడంలో హార్దిక్ పాత్ర కూడా చాలా కీలకం. కానీ ఈ ఏడాది హార్దిక్ ఐదు మ్యాచుల్లో కలిపి కేవలం 49 పరుగులే చేశాడు. అలాగే 10 ఓవర్లు బౌలింగ్ చేసిన అతను ఒకే ఒక్క వికెట్ తీసుకున్నాడు. గతేడాది ఆసియా కప్ నుంచి హార్దిక్ పెర్ఫామెన్స్ దిగజారింది. దానికితోడు గతంలోలా అతను భారీ షాట్లతో తన ఇన్నింగ్స్ మొదలు పెట్టకపోవడం కూడా అతని ఆటతీరుపై నెగిటివ్ ఎఫెక్ట్ చూపించింది.