ప్రపంచ నెంబర్ వన్ టీ20 ప్లేయర్, టీమిండియా స్టార్ సూర్యకుమార్ యాదవ్ ఒంటి నిండా చాలా టాటూలు ఉన్నాయి. అవి ఒక్కోటీ వేటి గురించి వేయించుకున్నదీ, అవి ఏంటి? అనే విషయాలు చాలా మందికి తెలియవు. ఇటీవల ఐపీఎల్‌లో ముంబై తరఫున అదరగొట్టిన అతను తాజాగా తన టాటూల గురించి వివరాలు వెల్లడించాడు.
'మా అమ్మానాన్నల పేర్లు టాటూ వేయించుకున్నా. అదే నా ఫస్ట్ టాటూ. మిగతావి వేయించుకోవడానికి అది పర్మిషన్‌లా కూడా పనిచేసింది. ఇక నా మరో టాటూ ఈవిల్ ఐ. నాకు త్వరగా దిష్టి తగులుతుందని నా భార్య ఈ దిష్టి కన్ను టాటూ వేయించుకోమని చెప్పింది' అని వెల్లడించాడు. తాజాగా జియో సినిమాలో ఈ వివరాలను సూర్య బయటపెట్టాడు.

'ఇక భుజంపై మా అమ్మానాన్న ఫొటో టాటూ ఉంది. అది నాలుగైదు సంవత్సరాల క్రితం వేయించుకున్నది. అది నా ఫేవరెట్ కూడా. మరొకటి ప్రశాంతంగా ఉన్న సింహం బొమ్మ. నేను కూడా అలాగే' అంటూ నవ్వాడు సూర్య. అలాగే మరొక టాటూ బాణాలు కూడా సూర్య చేతిపై ఉంది. 'జీవితం మనల్ని వెనక్కు లాగిందంటే.. ఇంకా ముందుకు పంపేందుకే అనే దానికి సంకేతంగా ఈ టాటూ వేయించుకున్నా' అని చెప్పాడు.
దీనికి ఉదాహరణగా ఆస్ట్రేలియాపై తను వరుసగా మూడు డకౌట్లు నమోదు చేయడం గురించి గుర్తుచేశాడు. ఇవే కాకుండా అతని చేతిపై ఒక ప్రత్యేకమైన గుర్తు టాటూ కూడా ఉంటుంది. దాని గురించి కూడా సూర్య చెప్పాడు. అది న్యూజిల్యాండ్‌లో ఉండే మోరీ తెగకు చెందిన గుర్తు. అది అదృష్టాన్ని తీసుకురావడంతోపాటు, తనను ప్రశాంతంగా ఉంచుతుందని చెప్పాడు. తను కివీస్ పర్యటనలో ఉండగా ఈ టాటూ వేయించుకున్నట్లు చెప్పాడు. న్యూజిల్యాండ్‌లో ఒక వ్యక్తి తనకు మోరీ తెగ గురించి చెప్పాడని, అప్పుడే ఈ టాటూ వేయించుకున్నానని తెలిపాడు.