హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్ 16వ ఎడిషన్‌లో ఇవ్వాళ సన్‌రైజర్స్ హైదరాబాద్- రాజస్థాన్ రాయల్స్ తలపడుతున్నాయి. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం దీనికి ఆతిథ్యాన్ని ఇస్తోంది. ఈ సీజన్ లో ఈ రెండు జట్లకు ఇదే తొలి మ్యాచ్. గత సీజన్ లో ఫైనల్స్ కు చేరిన జట్టు రాజస్థాన్ రాయల్స్. ఆల్‌రౌండర్లతో నిండివుంది. అదే సీజన్ లో అట్టర్ ఫ్లాప్ పెర్‌ఫార్మెన్స్ ఇచ్చింది సన్‌రైజర్స్ హైదరాబాద్. ఇప్పుడూ అదే రేంజ్ లో చెత్త ప్రదర్శన చేస్తోంది.
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడమే టెంపరరీ కేప్టెన్ భువనేశ్వర్ కుమార్ తీసుకున్న రాంగ్ డెసిషన్. ఇన్నింగ్ తొలి బంతి నుంచే విరుచుకుపడుతున్నారు రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్లు. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ స్పీడ్ తో పరుగులు పెడుతోంది స్కోర్ బోర్డు. ఓపెనర్ జోస్ బట్లర్ 22 బంతుల్లో ఏడు ఫోర్లు, మూడు భారీ సిక్సర్లతో హాఫ్ సెంచరీని దాటేశాడంటే రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్ వేగం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

54 పరుగుల మీద ఉన్నప్పుడు ఫజల్ హక్ ఫారూఖీ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. ఫారూఖీ సంధించిన లెంగ్త్ బంతిని షాట్ ఆడబోయి టైమింగ్ మిస్ అయ్యాడు జోస్. బంతి కాస్తా వికెట్లను గిరాటేసింది. అప్పటికే 5.5 ఓవర్లల్లో 85 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్ టీమ్. మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ సైతం చెలరేగుతున్నాడు. 22 బంతుల్లో 40 పరుగుల మీద ఆడుతున్నాడు. ఇందులో ఏడు ఫోర్లు ఉన్నాయి. జోస్ బట్లర్ అవుట్ అయిన తరువాత సంజు శాంసన్ క్రీజ్ లోకి ఎంటర్ అయ్యాడు. బిగినింగ్ లోనే రెండు ఫోర్లు బాదాడు. 9 ఓవర్లకు ఒక వికెట్ నష్టానికి 110 పరుగులు చేసింది రాజస్థాన్.
రాజస్థాన్ బ్యాటర్లు ఏ ఒక్క బౌలర్ ను కూడా మినహాయించలేదు. కేప్టెన్ భువనేశ్వర్ కుమార్ రెండు ఓవర్లలోనే 23 పరుగులు సమర్పించుకున్నాడు. ఫజల హక్ ఫారూఖీ ఒక వికెట్ పడగొట్టాడన్న తృప్తే గానీ రెండు ఓవర్లల్లో 26 పరుగులను ఇచ్చుకున్నాడు. వాషింగ్టన్ సుందర్ బౌలింగ్ మరీ ఘోరం. అతని ఒక్క ఓవర్ లోనే 19 పరుగులను పిండుకున్నారు రాజస్థాన్ బ్యాటర్లు. టీ నటరాజన్ పరిస్థితీ అంతే. ఒకే ఓవర్ లో 17 పరుగులు ధారాళంగా సమర్పించుకున్నాడు.
ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్ కూడా దీనికి భిన్నంగా ఏమీ లేదు. ఒక్క ఆదిల్ రషీద్ మాత్రమే పొదుపుగా బౌలింగ్ చేశాడు. రెండు ఓవర్లల్లో 13 పరుగులు ఇచ్చాడంతే. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ దుస్థితి- లోకల్ ఫ్యాన్స్ ను తీవ్రంగా నిరుత్సాహానికి గురి చేసింది. బౌలర్ల మీద సోషల్ మీడియాలో బూతులు తిడుతున్నారు. వీఐపీ స్టాండ్స్ లో విక్టరీ వెంకటేష్ మెరిశాడు. మ్యాచ్ ఆరంభానికి అరగంట ముందే స్టేడియానికి చేరుకున్నాడాయన. ప్రారంభంలో జోష్ గా కనిపించినప్పటికీ.. మ్యాచ్ కొనసాగుతున్న కొద్దీ వెంకటేష్ డీలా పడ్డాడు. బౌలర్ల తీరుతో నిరాశకు గురయ్యాడు.