హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్ 16వ ఎడిషన్‌లో ఇవ్వాళ సన్‌రైజర్స్ హైదరాబాద్- రాజస్థాన్ రాయల్స్ తలపడనున్నాయి. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం దీనికి ఆతిథ్యాన్ని ఇస్తోంది. ఈ సీజన్ లో ఈ రెండు జట్లకు ఇదే తొలి మ్యాచ్. గత సీజన్ లో ఫైనల్స్ కు చేరిన జట్టు రాజస్థాన్ రాయల్స్. ఆల్‌రౌండర్లతో నిండివుంది. అదే సీజన్ లో అట్టర్ ఫ్లాప్ పెర్‌ఫార్మెన్స్ ఇచ్చింది సన్‌రైజర్స్ హైదరాబాద్. ఈ రెండు జట్లు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి.
సన్‌రైజర్స్‌కు పేస్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ కేప్టెన్ గా వ్యవహరిస్తోన్నాడు. ఫుల్ టైమ్ కేప్టెన్ ఎయిడెన్ మార్క్‌రమ్ ఇంకా జట్టుకు అందుబాటులో లేడు. తన దేశం తరఫున ఇంటర్నేషనల్ సిరీస్ ఆడుతున్నాడు. అతను జట్టుకు దూరం కావడం వల్ల భువనేశ్వర్ కుమార్ తాత్కాలికంగా జట్టు పగ్గాలను అందుకున్నాడు. అతని సారథ్యంలో బలమైన రాజస్థాన్ రాయల్స్‌ను ఢీ కొట్టడానికి సమాయాత్తమైంది సన్‌రైజర్స్ టీమ్.

ఈ మ్యాచ్‌తో భువనేశ్వర్- ఓ కొత్త రికార్డును అందుకోవడం ఖాయం. ఇది అతనికి 250 టీ20 మ్యాచ్. ఐపీఎల్‌లో 154 మ్యాచ్‌లు ఆడాడు. టీ20 ఇంటర్నేషనల్స్ కూడా లెక్కలోకి తీసుకుంటే 249 మ్యాచ్‌లను ఆడాడు. రాజస్థాన్ రాయల్స్ తో తన 250వ టీ20ని ఆడబోతోన్నాడు.. అది కూడా కేప్టెన్ హోదాలో. అతని కేరీర్‌లో ఇదొక ల్యాండ్ మార్క్‌గా మిగిలిపోతుంది. మ్యాచ్‌ను గెలిస్తే- చిరస్మరణీయ విజయాన్ని అందుకున్నట్టవుతుంది భువికి. అలాగే- 250కి పైగా టీ20 మ్యాచ్‌లను ఆడిన 14 మంది క్రికెటర్ల క్లబ్‌లో చేరినట్టవుతుందతనికి.
రాజస్థాన్ రాయల్స్ ఏస్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ కు కూడా ఈ మ్యాచ్ ఓ మధుర జ్ఞాపకంగా మిగిలిపోయే అవకాశం ఉంది. ఒక్క వికెట్ తీసుకుంటే సరికొత్త రికార్డును నెలకొల్పినట్టవుతాడు. 300 వికెట్ల క్లబ్‌లో చేరడానికి ఒకే ఒక్క వికెట్ దూరంలో నిలిచాడు చాహల్. ఇప్పటివరకు 7.59 ఎకానమీతో 261 ఇన్నింగ్స్‌లల్లో 299 వికెట్లను నేలకూల్చాడు.
రాజస్థాన్ రాయల్స్ కే చెందిన బ్యాటింగ్ బ్యాక్‌బోన్ జోస్ బట్లర్.. టీ20ల్లో 9,500 పరుగులకు చేరువ అయ్యాడు. ఈ ఫిగర్ ను అందుకోవడానికి అతనికి 93 పరుగులు అవసరం అయ్యాయి. గత సీజన్ తరహాలో సన్‌రైజర్స్ పై జరిగే ఈ మ్యాచ్ లో గనక మెరుపులు మెరిపించగలిగితే- ఈ రికార్డును అందుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. ఇప్పుడు కాకపోయినా ఒకట్రెండు మ్యాచ్‌లల్లో ఈ డ్రీమ్ ల్యాండ్ మార్క్‌ను అందుకోవడం ఖాయం.