న్యూఢిల్లీ: ఐపీఎల్ 2023 ప్లేఆఫ్స్ చేరాలంటే- గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సత్తా చాటింది. సన్‌రైజర్స్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. ఈ గెలుపుతో ప్లేఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకోగలిగింది. పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకింది. ఇంకా ఓ మ్యాచ్ మిగిలేవున్న నేపథ్యంలో- ఇదే దూకుడును చూపించగలిగితే ప్లేఆఫ్స్ చేరుకోవడం లాంఛనప్రాయమే.
గురువారం రాత్రి ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లల్లో అయిదు వికెట్ల నష్టానికి 186 పరుగులు చేయగా.. ఇంకా నాలుగు బంతులు మిగిలివుండగానే ఆర్సీబీ టార్గెట్‌ను ఛేదించింది. 19.4 ఓవర్లల్లో 187 పరుగులతో విజయాన్ని అందుకుంది. ఈ క్రమంలో రెండు వికెట్లను మాత్రమే నష్టపోయింది. ఆర్సీబీ బ్యాటింగ్ మిషన్ విరాట్ కోహ్లీ మరోసారి రెచ్చిపోయాడు. సెంచరీతో మెరిశాడు.

విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌పై పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ అమీర్ ప్రశంసల వర్షాన్ని కురిపించాడు. కోహ్లీని ఓన్లీ రియల్ కింగ్‌గా అభివర్ణించాడు. సమకాలీన క్రికెట్‌లో అతణ్ని మించిన ప్లేయర్ మరెవరూ లేరంటూ పొగడ్తలతో ముంచెత్తాడు. ఇన్ స్వింగ్ విత్ అమీర్ కాన్సెప్ట్‌పై పాకిస్తాన్‌కు చెందిన ఓ యూట్యూబ్ ఛానల్ నిర్వహంచిన టాక్ షోలో మహ్మద్ అమీర్ పాల్గొన్నాడు.
తన అభిమాన క్రికెటర్ కోహ్లీ మాత్రమేనని, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అతణ్ని మించిన ప్లేయర్ లేడని అమీర్ పేర్కొన్నాడు. ఈ తరంలో కోహ్లీతో పోల్చదగ్గ మరో క్రికెటర్ లేడని, అతని అఛీవ్‌మెంట్స్ అత్యద్భుతమని చెప్పాడు. ఖచ్చితంగా గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో సెంచరీతో తన జట్టును గెలిపించడం అసాధ్యమని, అందుకే- ఈ ఫీట్ అతనికి చిరకాలం గుర్తుండిపోతుందని వ్యాఖ్యానించాడు.
కోహ్లీ ఆడిన కొన్ని షాట్స్.. బౌలర్లను విస్మయానికి గురి చేశాయని చెప్పాడు అమీర్. నాలుగు సంవత్సరాల తరువాత కోహ్లీ ఐపీఎల్‌లో సెంచరీ సాధించాడని, టీ20 ఫార్మట్ టోర్నమెంట్ చరిత్రలో ఆరు సెంచరీలు చేయడం అంటే అసాధారణమని చెప్పాడు. కోహ్లీ ఒక్కడే సమకాలీన క్రికెట్‌కు నిఖార్సయిన చక్రవర్తి అని ప్రశంసించాడు. వచ్చే అయిదు సంవత్సరాల కాలం కోహ్లీదేనని, ఎన్ని రికార్డులు నెలకొల్పుతాడో తనకు తెలియట్లేదని పేర్కొన్నాడు.