హైదరాబాద్: ఐపీఎల్ 2023 సీజన్‌లో ముంబై ఇండియన్స్ మరో అద్భుత విజయాన్ని అందుకుంది. 200లకు పైగా టార్గెట్‌ను అలవోకగా ఛేదించింది. పంజాబ్ కింగ్స్‌పై ప్రతీకారాన్ని తీర్చుకుంది. అసాధ్యమనుకున్న లక్ష్యాన్ని ఇంకో ఏడుబంతులు మిగిలివుండగానే కొట్టి పడేసింది. వరుసగా ముంబై ఇండియన్స్ సాధించిన రెండో గెలుపు ఇది. శనివారం తన తదుపరి మ్యాచ్‌ను ఆడనుంది ముంబై. చెన్నై సూపర్ కింగ్స్‌ను ఢీ కొట్టనుంది.
ఇవ్వాళ- సన్‌రైజర్స్ హైదరాబాద్ తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సన్నద్ధమౌతోంది. తనతో పాటు వరుస పరాజయాలను చవి చూస్తోన్న కోల్‌కత నైట్‌రైడర్స్‌ను ఢీ కొట్టబోతోంది. ఈ సాయంత్రం 7:30 గంటలకు హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం ఈ మ్యాచ్‌కు ఆతిథ్యాన్ని ఇస్తోంది. ప్లేఆఫ్స్ సమీపిస్తోన్న నేపథ్యంలో- ఇకపై ఆడే ప్రతీ మ్యాచ్‌ను గెలిచి తీరాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటోన్నాయి ఈ రెండు జట్లు.

చివరి అయిదు మ్యాచ్‌లల్లో రెండేసి చొప్పున విజయాలను సాధించాయి. పాయింట్ల పట్టికలో కోల్‌కత నైట్‌రైడర్స్ ఎనిమిదో స్థానంలో నిలవగా.. సన్‌రైజర్స్ ప్లేస్ తొమ్మిది. ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా నిలుపుకోవాలంటే ఈ మ్యాచ్‌ను గెలిచి తీరాల్సి ఉంటుంది ఈ రెండు జట్లకూ. ఈ పరిస్థితుల్లో కోల్‌కత నైట్‌రైడర్స్ కొత్త ప్లేయర్‌ను జట్టులోకి తీసుకుంది.
బంగ్లాదేశ్ డాషింగ్ ఓపెనర్ లిట్టన్ దాస్ (Litton Das) స్థానంలో అతన్ని రీప్లేస్ చేసింది. ఈ సిరీస్ మొత్తానికీ ఆ కొత్త ప్లేయర్ జట్టుకు అందుబాటులో ఉండబోతోన్నాడు. ఫ్యామిలీ ఎమర్జెన్సీతో లిట్టన్ దాస్ జట్టుకు దూరం అయ్యాడు. స్వదేశానికి వెళ్లిపోయాడు. సిరీస్ మొత్తానికీ అతను అందుబాటులో ఉండట్లేదు. ఈ నేపథ్యంలో లిట్టన్ స్థానంలో కొత్త ప్లేయర్‌ను జట్టులోకి తీసుకుంది కోల్‌కత నైట్‌రైడర్స్.
అతనే- జాన్సన్ ఛార్లెస్ (Johnson Charles). వెస్టిండీస్ వికెట్ కీపర్. 50 లక్షల రూపాయల బేస్ ప్రైస్‌తో అతణ్ని జట్టులోకి తీసుకుంది. టీ20 స్పెషలిస్ట్ వికెట్ కీపర్ బ్యాటర్ అతను. ఇప్పటివరకు వెస్టిండీస్ తరఫున 41 టీ20 ఇంటర్నేషనల్స్ ఆడాడు. 971 పరుగులు చేశాడు. 2012, 2016ల్లో టీ20 ప్రపంచకప్‌ను గెలిచిన వెస్టిండీస్ జట్టులో సభ్యుడు. వేర్వేరుగా 224 టీ20 మ్యాచ్‌లను ఆడిన అనుభవం అతనికి ఉంది. ఈ ఫార్మట్‌లో మొత్తంగా 5,600 పరుగులు చేశాడు.
ఛార్లెస్ జాన్సన్‌కు ఇదే తొలి ఐపీఎల్ సీజన్. ఈ సీజన్ కోసం జరిగిన మెగా ఆక్షన్‌లో అతను పోటీ పడినప్పటికీ ఏ ఫ్రాంఛైజీ కూడా అతణ్ని తీసుకోలేదు. అతని బేస్ ప్రైస్ 50 లక్షల రూపాయలు. ఇప్పుడు అదే మొత్తానికి ఛార్లస్‌ను కోల్‌కత నైట్‌రైడర్స్ మేనేజ్‌మెంట్ అగ్రిమెంట్ కుదుర్చుకుంది. నేడో, రేపో అతను జట్టుతో కలవనున్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగే మ్యాచ్ లేదా తాను ఆడే తదుపరి మ్యాచ్‌లో అతణ్ని ఆడించే అవకాశం ఉంది కేకేఆర్.