రియాద్: క్రికెట్ ఆడే దేశాల్లో అత్యంత ధనిక బోర్డ్ ఏదైనా ఉందంటే భారత క్రికెట్ కంట్రోల్ బోర్డే. ప్రతి సంవత్సరం వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా క్రీడారంగం ద్వారా వచ్చే ఆదాయంలో 70 నుంచి 80 శాతం.. బీసీసీఐకి చేరుతోంది. అటు ఆయా దేశాల క్రికెట్ బోర్డులకు పెద్దన్నలా వ్యవహరిస్తోంది. వారిపై పెత్తనం చలాయిస్తోంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ఆరంభమైన తరువాత బీసీసీఐ.. తన పట్టు, ఆధిపత్యాన్ని మరింత పెంచుకుంది.
ఈ క్రమంలో ఐపీఎల్ ద్వారా వచ్చే రెవెన్యూను రెట్టింపు చేసుకునేలా బీసీసీఐ ప్రణాళికలను రూపొందించుకుంది. ఐపీఎల్ మ్యాచ్‌ల సంఖ్యనూ పెంచింది. దీనికోసం ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్‌ను సైతం ఒప్పించింది. ప్రతి సంవత్సరం ఐపీఎల్ మ్యాచ్‌ల సంఖ్యను క్రమంగా పెంచుకుంటూ వెళ్లేలా కార్యాచరణ ప్రణాళికను రూపొందించే ప్రయత్నాల్లో ఉంది బీసీసీఐ. మున్ముందు జరిగే ఐపీఎల్ సీజన్లల్లో మ్యాచ్‌ల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు లేకపోలేదు.

గత ఏడాదే కొత్తగా అడుగు పెట్టిన గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంఛైజీల వల్ల 8,000 కోట్ల రూపాయలకు పైగా అదనపు రెవెన్యూ బీసీసీఐ ఖజానాలో జమ అయింది. బీసీసీఐ నిర్దేశించిన బేస్‌ప్రైస్ కంటే ఈ రెండు జట్లు కూడా రెట్టింపు మొత్తాన్ని కోట్ చేస్తూ బిడ్డింగులను దాఖలు చేశాయి. లక్నో సూపర్ జెయింట్స్ పేరుతో ఆర్పీ-సంజీవ్ గోయెంకా, గుజరాత్ టైటాన్స్ పేరుతో సీవీసీ కేపిటల్స్ ఈ సీజన్‌లోనే కొత్త ఫ్రాంఛైజీలను ఏర్పాటు చేశాయి.
అటు ప్లేయర్లపైనా కనకవర్షం కురుస్తోంది ఈ టోర్నమెంట్ ద్వారా. టీ20 స్పెషలిస్ట్ ప్లేయర్ల కోసం ఎన్ని కోట్లయినా ఖర్చు చేయడానికి వెనుకాడట్లేదు ఫ్రాంఛైజీలు. సామ్ కుర్రన్, కామెరాన్ గ్రీన్, బెన్ స్టోక్స్, కేఎల్ రాహుల్, నికొలస్ పూరన్.. ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడుపోయిన ఐపీఎల్ క్రికెటర్ల జాబితాలో ఉన్నారు. వారి కోసం ఆయా ఫ్రాంఛైజీలు కోట్ల రూపాయలను ధారబోశాయి.
ఇప్పుడు తాజాగా సౌదీ అరేబియా ప్రభుత్వం కొత్తగా ఐపీఎల్ తరహా లీగ్ టోర్నమెంట్‌ను సెటప్ చేయాలని ప్లాన్ చేస్తోంది. ప్రపంచంలోనే అత్యంత ధనిక లీగ్ టోర్నమెంట్‌గా మార్చాలని భావిస్తోంది. దీనికోసం ఐసీసీతో సంప్రదింపులు కూడా మొదలు పెట్టింది. ప్రభుత్వం తరఫున క్రికెట్‌లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాలని సౌదీ అరేబియా ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఐసీసీ ఛైర్మన్ గ్రెగ్ బార్క్‌క్లే ఇదివరకే ఈ విషయాన్ని నిర్ధారించారు.
ప్రపంచంలో కోట్లాది మంది వీక్షించే ఐఫా సాకర్ టోర్నమెంట్, ఫార్ములా వన్ తరహాలో క్రికెట్ సెగ్మెంట్‌లో రిచ్చెస్ట్ టీ20 లీగ్ టోర్నమెంట్‌ను నిర్వహించాలని సౌదీ అరేబియా ప్రభుత్వం ప్రణాళికలను రూపొందించుకుంది. ఈ టీ20 లీగ్ టోర్నమెంట్‌లో ఐపీఎల్ ఫ్రాంచైజీలకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా అటు భారత్‌తో క్రీడా సంబంధాలు కూడా మరింత బలోపేతమౌతాయని సౌదీ భావిస్తోంది. సౌదీ అరేబియాను గ్లోబల్ క్రికెట్ డెస్టినేషన్‌గా తీర్చిదిద్దాలనుకుంటోంది.