జైపూర్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో చెన్నై సూపర్ కింగ్స్.. వరుస విజయాలకు బ్రేక్ పడింది. వరుసగా మూడింట్లో విజయం సాధించిన ధోనీ సేన దూకుడుకు రాజస్థాన్ రాయల్స్ కళ్లెం వేసింది. ఏకంగా 32 పరుగులతో తేడా మట్టి కరిపించింది. సీఎస్‌కేపై సాధించిన ఈ గెలుపుతో రాజస్థాన్- పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని ఆక్రమించింది. ఎనిమిది మ్యాచ్‌లల్లో అయిదు విజయాలతో టాప్ పొజీషన్‌లో నిలిచింది.
గురువారం రాత్రి జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఓడిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లల్లో అయిదు వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్.. చివరి వరకు పోరాడింది గానీ లక్ష్యాన్ని అందుకోలేకపోయింది. 20 ఓవర్లల్లో ఆరు వికెట్ల నష్టానికి 170 పరుగుల వద్ద నిలిచింది ఆ జట్టు ప్రస్థానం.

చెన్నై సూపర్ కింగ్స్ ఒక్కటే కాదు.. పలు జట్లు ఛేజింగ్ అంటే బెంబేలెత్తుతున్నాయి. ప్రత్యర్థి నిర్దేశించిన లక్ష్యాన్ని అందుకోలేక మధ్యలోనే చేతులెత్తేస్తోన్నాయి. ఒకటి కాదు.. రెండూ కాదు- ఇప్పటివరకు వరుసగా ఎనిమిది మ్యాచ్‌ల రిజల్ట్- దీన్ని ప్రూవ్ చేస్తోంది. రెండోసారి బ్యాటింగ్‌కు దిగిన జట్టు వరుసగా ఎనిమిది మ్యాచ్‌లల్లో ఓడిపోవడం అరుదే.
ఛేజింగ్ అంటే- శివాలెత్తి ఆడే ముంబై ఇండియన్స్ ఏకంగా రెండుసార్లు ఓడింది. గత శనివారం లక్నో సూపర్ జెయింట్స్ ఈ సంప్రదాయానికి తెర తీసినట్టయింది. గుజరాత్ టైటాన్స్‌పై జరిగిన మ్యాచ్‌లో ఓడిందా జట్టు. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్దేశించిన 135 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కూడా అందుకోలేకపోయింది. 128 పరుగులే చేయగలిగింది. పంజాబ్ కింగ్స్‌పై నిర్దేశించిన 214 పరుగులకు చేరుకోలేకపోయింది ముంబై ఇండియన్స్. 20 ఓవర్లల్లో ఆరు వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది.
లక్నో సూపర్ జెయింట్స్‌పై జరిగిన మరో మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 10 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. లక్నో నిర్దేశించిన 154 పరుగులను ఛేదించలేకపోయింది రాజస్థాన్. మరో మ్యాచ్‌లో కోల్‌కత నైట్ రైడర్స్ పరిస్థితీ అంతే. చెన్నై సూపర్ కింగ్స్ తన ముందు ఉంచిన 235 పరుగులను అందుకోలేక చతికిలపడిందా జట్టు. 186 పరుగుల వద్దే తన ప్రస్థానాన్ని ముగించింది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ కూడా ఈ లిస్ట్‌లో ఉంది. ఢిల్లీ కేపిటల్స్‌పై ఏడు పరుగుల తేడాతో ఓడిందీ ఆరెంజ్ ఆర్మీ. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 144 పరుగులు చేయగా.. పోరాడదగ్గ ఈ స్కోర్‌ను కూడా చేయలేకపోయింది సన్‌రైజర్స్. 137 పరుగులే చేసింది. గుజరాత్ టైటాన్స్‌పై జరిగిన మరో మ్యాచ్‌లో ముంబై మరోసారి లక్ష్యాన్ని కొట్టలేకపోయింది. గుజరాత్ పెట్టిన 207 పరుగులకు బదులుగా 152 పరుగులే చేసింది.
కోల్‌కత నైట్ రైడర్స్‌పై జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా ఓటమి బాట పట్టిన విషయం తెలిసిందే. తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ అయిదు వికెట్ల నష్టానికి 200 పరుగులు చేయగా ఆర్సీబీ- 179 పరుగులే చేసింది. తన సొంత గడ్డపై కోల్‌కత నైట్ రైడర్స్ చేతిలో మట్టికరిచింది. తాజాగా గురువారం రాత్రి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఓడిన విషయం తెలిసిందే.