ఐపీఎల్ పండుగ మొదలయ్యేందుకు అంతా సిద్ధమైంది. దేశ వ్యాప్తంగా ఉన్న వేదికలన్నీ ఐపీఎల్ మ్యాచులు నిర్వహించేందుకు రెడీ అయ్యాయి. ఈ క్రమంలో తమ తొలి మ్యాచ్‌లో బలమైన ఆర్సీబీని ఎదుర్కొనేందుకు ముంబై ఇండియన్స్ రెడీ అవుతంది. ఐపీఎల్ చరిత్రలో మోస్ట్ సక్సెస్‌ఫుల్ జట్టుగా పేరొందిన ముంబై.. గతేడాది పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ ఏడాది ఎలాగైనా ఈ పరిస్థితిని మార్చాలని ముంబై గట్టిగా ప్రయత్నిస్తోంది.
ఆర్సీబీతో మ్యాచ్‌ను విజయంతో మొదలు పెట్టాలని ముంబై ఇండియన్స్ పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలోనే ముంబై బ్యాటర్లు భారీ షాట్లు ప్రాక్టీస్ చేస్తుంటే.. బౌలర్లు కత్తుల వంటి బంతులు వేయడంలో ట్రైనింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ముంబై ఇండియన్స్ ప్రధాన పేసర్ జోఫ్రా ఆర్చర్ తన బౌలింగ్‌తో ప్రీమియమ్ ఓపెనర్లు రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ ఇద్దరినీ తెగ ఇబ్బంది పెట్టాడు. దీనికి సంబంధించిన వీడియోను ముంబై ఇండియన్స్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేయగా అతి తెగ వైరల్ అవుతోంది.

వెన్నుగాయం కారణంగా జస్‌ప్రీత్ బుమ్రా ఈ ఏడాది ఐపీఎల్ ఆడటం లేదు. దీంతో ముంబై ఇండియన్స్ బౌలింగ్ భారం అంతా జోఫ్రా ఆర్చర్‌పైనే పడనుంది. అతను రాణిస్తే ముంబైకి అదే పదివేలు. అయితే తను కూడా గాయం కారణంగా గతేడాది ఐపీఎల్ ఆడలేదు. కానీ ఇటీవల మళ్లీ ఆడటం మొదలు పెట్టిన అతను బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20, వన్డే సిరీసుల్లో ఫర్వాలేదనిపించాడు. అలాగే సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో కూడా రాణించాడు.
ఇదే ఫామ్‌ను జోఫ్రా ఆర్చర్.. ఈ ఐపీఎల్‌లో కూడా కొనసాగించాలని ముంబై అభిమానులు కోరుకుంటున్నారు. ఆర్చర్ కేవలం బౌలింగ్‌లోనే కాదు. లోయర్ ఆర్డర్‌లో అవసరమైతే భారీ షాట్లతో విలువైన పరుగులు కూడా చేయగలడు. ఇలా అతను బ్యాటింగ్ చేస్తున్న వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆర్చర్ కనుక ఫుల్ ఫామ్‌లో ఉంటే ముంబై బలం రెట్టింపు అవడం ఖాయమని ఫ్యాన్స్ అంటున్నారు.