గతేడాది చివర్లో రోడ్డు ప్రమాదం కారణంగా ఆటకు దూరమైన టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్‌కు బంపరాఫర్ లభించింది. చాలా కాలంగా ఐపీఎల్ సహా క్రికెట్ మ్యాచులు ప్రసారం చేస్తున్న స్టార్ స్పోర్ట్స్ నుంచి ఈ ఆఫర్ వచ్చింది. దేశంలో క్రికెట్ పాపులారిటీని పెంచెందుకు స్టార్ స్పోర్ట్స్ కొత్త కొత్త క్యాంపెయిన్లు చేపట్టాలని చూస్తోంది. దీని కోసం ప్రముఖ క్రికెటర్లతో 'బిలీవ్ అంబాసిడర్లు'గా ఒప్పందం చేసుకుంటోంది.
ఈ అంబాసిడర్లు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వస్తారని, అలాగే వేరు వేరు ఐపీఎల్ టీమ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తారని స్టార్ స్పోర్ట్స్ టీం వెల్లడించింది. వీళ్లతో కలిసి కొత్త క్యాంపెయిన్ల ద్వారా ఈ ఆట పాపులారిటీని పెంచడంతోపాటు ఫ్యాన్‌డమ్‌లలో మరింత జోష్ నింపేందుకు ప్రయత్నిస్తామని తెలిపింది. తమ ఫోకస్ అంతా కుర్రాళ్లపైనే ఉంటుందని వెల్లడించింది.

గతేడాది స్టార్ స్పోర్ట్స్ వద్ద కేవలం ఇద్దరు బిలీవ్ అంబాసిడర్లే ఉన్నారు. ఆ సంఖ్యను ఈ సంస్థ ఆరుకు పెంచింది. వీరిలో విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా వంటి స్టార్ ప్లేయర్లు కూడా ఉన్నారు. ఈ బృందంలోకి రిషభ్ పంత్ కూడా వస్తున్నందుకు తాము చాలా సంతోషిస్తున్నామని స్టార్స్ స్పోర్ట్స్ ప్రతినిధులు చెప్పారు. పంత్ కూడా ఈ సంస్థతో కలిసి పనిచేయడం వల్ల క్రికెట్ పాపులారిటీ పెంచే అవకాశం రావడం తన అదృష్టమని చెప్పాడు.
కుర్రాళ్లలో క్రికెట్ పాపులారిటీని పెంచే అవకాశం వచ్చిందని, ఈ బిలీవ్ అంబాసిడర్‌గా భారత యువతలో స్ఫూర్తి నింపే ఛాన్స్ తనకు లభించిందని చెప్పాడు. దేశంలో ఎక్కడి నుంచి వచ్చినా కష్టపడితే కలలు నిజం చేసుకోవచ్చనే విషయాన్ని వారికి చెప్తానని, వాళ్లు తమ కష్టాన్ని నమ్మేలా చేయడానికి కృషి చేస్తానని చెప్పాడు. 'స్టార్ స్పోర్ట్స్ బిలీవ్ అంబాసిడర్‌గా ఈ సంస్థతో కలిసి పని చేస్తానని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నా' అని పంత్ తెలిపాడు.

'ఈ కంపెనీ భాగస్వామ్యంలో క్రికెట్‌ను మరింత పాపులర్ క్రీడగా మార్చేందుకు కృషి చేస్తా. ముఖ్యంగా కుర్రాళ్లలో ఈ క్రీడ క్రేజ్ పెంచేందుకు ప్రయత్నిస్తాం. కుర్రాళ్లలో ఆనందాన్ని నింపడంతోపాటు వారి జీవితాల్లో వెలుగులు నింపి, జీవితానికి అవసరమయ్యే ఎన్నో విలువైన గుణపాఠాలను నేర్పే శక్తి క్రికెట్‌కు ఉంది' అని పంత్ చెప్పుకొచ్చాడు.
రూర్కీలో పుట్టిన ఒక కుర్రాడు.. తన దేశానికి ప్రాతినిధ్య వహించి, ఎన్నో అద్భుతమైన విజయాలు అందించాలని నమ్మాడని పంత్ అన్నాడు. స్టార్ స్పోర్ట్స్ సహకారంతో ఇదే విషయాన్ని మరింత మందికి చెప్పే ప్రయత్నం చేస్తానని అన్నాడు. 'నువ్వు ఎక్కడ పుట్టినా సరే.. నీ కలలను నిజం చేసుకోవడానికి కష్టపడాలి. అనుకున్నది సాధించగలనని నువ్వు నమ్మాలి. ఇదే విషయాన్ని భారత యువతకు చెప్పి వారిలో స్ఫూర్తి నింపుతా' అని పంత్ పేర్కొన్నాడు.