బెంగళూరు: ఐపీఎల్ 2023లో ఇవ్వాళ మరో ఆసక్తికరమైన మ్యాచ్. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు- కోల్‌కత నైట్ రైడర్స్ తలపడనున్నాయి. ఇది 36వ మ్యాచ్. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఈ సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఫాఫ్ డుప్లెసిస్, కోల్‌కత నైట్ రైడర్స్‌కు నితీష్ రాణా కేప్టెన్లుగా వ్యవహరిస్తోన్నారు.
కేకేఆర్ కంటే చాలా మెరుగ్గా ఉంది ఆర్సీబీ. ప్రస్తుతం హ్యాట్రిక్ విజయాల ముంగిట్లో నిలిచింది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే- వరుసగా మూడింట్లో విజయం సాధించినట్టవుతుంది. పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మరింత మెరుగుపర్చుకోగలుగుతుంది. ఇప్పటివరకు ఈ రెండు జట్లు ఏడేసి చొప్పున మ్యాచ్‌లను ఆడాయి. ఆర్సీబీ నాలుగింట్లో విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో అయిదో స్థానంలో ఉంది. నైట్ రైడర్స్ ఖాతాలో ఉన్నవి రెండు విజయాలే.

పాయింట్ల పట్టికలో ఈ టీమ్ ఎనిమిదో స్థానంలో నిలిచింది. వరుసగా రెండో విజయాలతో దూకుడు మీద ఉన్న రాయల్ ఛాలెంజర్స్‌ను ధీటుగా ఎదుర్కొనడానికి కసరత్తు పూర్తి చేసింది. ఈ మ్యాచ్ గెలవడం ద్వారా మళ్లీ విజయాల బాట పట్టాలని ఆశిస్తోంది. వరుసగా నాలుగు మ్యాచ్‌లల్లో ఘోరంగా ఓడింది కేకేఆర్. ఈ మ్యాచ్‌లో కూడా పరాజయం పాలైతే కోలుకోవడం దాదాపుగా అసాధ్యమే అవుతుంది.
గ్రీన్ జెర్సీతో ఆడిన చివరి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై రాయల్ ఛాలెంజర్స్ ఘన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌కు కేప్టెన్‌గా వ్యవహరించిన విరాట్ కోహ్లీ గోల్డెన్ డక్ నమోదు చేశాడు. గ్రీన్ జెర్సీలో ఆడిన చివరి మూడు మ్యాచ్‌లలోనూ ఇదే తరహాలో అవుట్ అయ్యాడు. బెంగళూరియన్లను నిరాశకు గురి చేశాడీ ఆర్సీబీ బ్యాటింగ్ మెషీన్.
ఇప్పుడు హోమ్ గ్రౌండ్‌కు విరాట్ కోహ్లీ దూరమౌతున్నాడు. ఇవ్వాళ కోల్‌కత నైట్ రైడర్స్‌తో జరిగే మ్యాచే చివరిది. వచ్చే అయిదు మ్యాచ్‌లు అవుట్ సైడ్ ఆఫ్ కర్ణాటకలోనే ఆడనుంది ఆర్సీబీ. మే 21వ తేదీ బెంగళూరులో అడుగు పెట్టబోదీ లోకల్ టీమ్. మే 21వ తేదీన తన చిట్టచివరి లీగ్ మ్యాచ్‌ను బెంగళూరులో ఆడుతుంది. గుజరాత్ టైటాన్స్‌ను ఢీ కొడుతుంది.
లక్నో సూపర్‌జెయింట్స్- లక్నో ఏకనా స్టేడియం, ఢిల్లీ కేపిటల్స్- ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియం, ముంబై ఇండియన్స్- ముంబై వాంఖెడే, రాజస్థాన్ రాయల్స్- జైపూర్ సవాయ్ మాన్‌సింగ్ స్టేడియం, సన్‌రైజర్స్ హైదరాబాద్- హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలల్లో ప్రత్యర్థులను ఎదుర్కొనాల్సి ఉంది రాయల్ ఛాలెంజర్స్‌కు. మే 21వ తేదీన చివరి లీగ్ మ్యాచ్‌ను బెంగళూరులో ఆడుతుంది.