న్యూఢిల్లీ: ఐపీఎల్ 2023 సీజన్ సెకెండ్ హాఫ్.. పోటాపోటీగా సాగుతోంది. స్టేడియాల్లో పరుగుల వరద పారుతోంది. భారీ లక్ష్యాలు సైతం చిత్తుచిత్తవుతున్నాయి. 200లకు పైగా చేసిన టార్గెట్ కూడా గెలుపుపై గ్యారెంటీ ఇవ్వట్లేదు. భారీగా పరుగులు రాబట్టిన జట్లు కూడా పరాజయాన్ని చవి చూస్తోన్నాయి. ప్లేఆఫ్స్ కోసం ప్రత్యర్థికి ధీటుగా తలపడుతున్నాయి.
శనివారం రాత్రి మొహాలీలో 181 పరుగుల టార్గెట్ గల్లంతయింది. ఢిల్లీ కేపిటల్స్ అలవోకగా దీన్ని ఛేదించింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్దేశించిన ఈ లక్ష్యాన్ని ఇంకా 20 బంతులు మిగిలివుండగానే కొట్టిపడేసింది. రెండు జట్ల ఇన్నింగ్స్‌లోనూ బ్యాటర్లు దుమ్ము లేపారు. బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఈ సీజన్‌లో బ్యాటర్లు తెగించి ఆడుతున్నారు. కౌంటర్ అటాక్‌కు దిగుతూ బౌలర్లకు చుక్కులు చూపిస్తోన్నారు.

ఇక ప్లేఆఫ్స్ సమీపిస్తోన్న కొద్దీ మ్యాచ్‌లు మరింత హోరాహోరీగా మారుతున్నాయి. జట్ల మధ్య పోటీ తీవ్రతరమౌతోంది. గెలిచి తీరాలనే తపన కనిపిస్తోంది. ప్లేఆఫ్స్ రేసులో తామూ ఉండాలనే పట్టుదలను ప్రదర్శిస్తోన్నాయి. ఢిల్లీ కేపిటల్స్ ఇన్నింగ్‌లో ఇదే కనిపించింది. పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచిన వార్నర్ సేన.. తెగించి ఆడింది. ఫియర్‌లెస్ క్రికెట్ ఆడింది. తన పాయింట్లను పెంచుకోగలిగింది.
అయినప్పటికీ- ఆ జట్టుకు ఉన్న ప్లేఆఫ్స్ చేరే అవకాశాలు నామమాత్రమే. ఇప్పటివరకు 10 మ్యాచ్‌లను ఆడిన ఢిల్లీ కేపిటల్స్ ఆరింట్లో ఓడింది. నాలుగు విజయాలతో ఎనిమిది పాయింట్లతో తొమ్మిదో స్థానంలో నిలిచింది. ఇంకా నాలుగు మ్యాచ్‌లను ఆడాల్సి ఉందా జట్టు. అన్నింట్లోనూ నెగ్గినా ప్లేఆఫ్స్ చేరే అవకాశాలు దాదాపుగా లేనట్టే. తన తదుపరి మ్యాచ్‌లో బలమైన చెన్నై సూపర్ కింగ్స్‌ను తలపడాల్సి ఉంది. ఈ నెల 10వ తేదీన సాయంత్రం 7:30 గంటలకు ఇది షెడ్యూల్ అయింది.
ఢిల్లీ కేపిటల్స్ చేతిలో ఓటమి తరువాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఉన్న ప్లేఆఫ్స్ చేరే అవకాశాలు దిగజారాయి. ఈ మ్యాచ్ ఆరంభానికి ముందు వరకు 54 శాతంగా ఉన్న ప్లేఆఫ్ ఛాన్సులు- మ్యాచ్ తరువాత 34కు పడిపోయాయి. ఈ జట్టు కూడా తాను ఆడబోయే మ్యాచ్‌లన్నింటినీ ఖచ్చితంగా గెలిచి తీరాల్సి పరిస్థితిని ఎదుర్కొంటోన్నట్టే. ఇంకో మ్యాచ్ ఓడిందంటే ఆర్సీబీ అవకాశాలు మరింత కష్టతరమౌతాయి.
సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఏ మాత్రం కూడా ప్లేఆఫ్స్ చేరే అవకాశాలు లేవు. ఈ జట్టుకు ఉన్న ప్లేఆఫ్ ఛాన్సులు నాలుగు శాతం మాత్రమే. పాయింట్ల పట్టికలో పదో స్థానానికి దిగజారింది ఆరెంజ్ ఆర్మీ. ఇంకా అయిదు మ్యాచ్‌లను ఆడాల్సి ఉంది. ఈ అయిదింట్లో కూడా భారీ తేడాతో ప్రత్యర్థిని ఓడించి తన నెట్ రన్‌రేట్‌ను అంతే భారీగా మెరుగుపర్చుకుంటే తప్ప సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్స్‌కు చేరలేదు.
ప్లేఆఫ్స్ చేరే అవకాశాలు ఉన్న జట్ల జాబితాలో గుజరాత్ టైటాన్స్ టాప్‌లో ఉంది. ఈ జట్టుకు ఉన్న ఛాన్సులు 91 శాతం. 78 శాతంతో రెండో స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్ నిలిచింది. 58 శాతంతో లక్నో సూపర్ జెయింట్స్ మూడో స్థానానికి చేరింది. రాజస్థాన్ రాయల్స్-42, ముంబై ఇండియన్స్-36, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు- 34, పంజాబ్ కింగ్స్- 31, కోల్‌కత నైట్ రైడర్స్-12, ఢిల్లీ కేపిటల్స్- 12, సన్‌రైజర్స్ హైదరాబాద్-4 శాతాలతో ఈ లిస్ట్‌లో ఉన్నాయి.