ఐపీఎల్ సీజన్ సగానికి వచ్చింది. ప్లేఆఫ్స్ రేసులో ఏయే జట్లు ఉన్నాయో? ఏ జట్లకు ఇక ఏమాత్రం అవకాశం లేదో దాదాపు తేలిపోయింది. ఈ క్రమంలో ఫ్యాన్స్ కూడా ఏ జట్లు ప్లేఆఫ్స్ చేరతాయని ఒక అంచనాకు వచ్చేస్తున్నారు. అయితే ప్లేఆఫ్స్ చేరే నాలుగు జట్లలో రెండింటి స్థానాలపై మాత్రం చాలా సస్పెన్స్ నెలకొంది.
ఎందుకంటే.. ఈ రెండు స్థానాల కోసం ఏకంగా ఆరు జట్లు తలపడుతున్నాయి. ఆ జట్లు ఏవి? అలాగే ప్లేఆఫ్స్ చేరడానికి ఏయే జట్టుకు ఎంత అవకాశం ఉందో ఒకసారి చూస్తే.. ఇప్పటికే ఎనిమిది విజయాలు సాధించి టేబుట్ టాపర్‌గా ఉన్న గుజరాత్ టైటాన్స్ ప్లేఆఫ్స్ చేరడం దాదాపు ఖాయమైంది. గణాంకాల ప్రకారం చూసుకున్నా.. ఈ టీం ప్లేఆఫ్స్ చేరడానికి 99.5 శాతం అవకాశాలు ఉన్నాయి.

తాము ఆడిన చివరి రెండు మ్యాచుల్లో ఓడి, ఒక మ్యాచ్ వర్షార్పణం అయినా కూడా.. ముంబైపై ఘనవిజయం సాధించిన చెన్నై కూడా ప్లేఆఫ్స్ రేసులో చాలా ముందు వరుసలో ఉంది. ప్రస్తుతం ఆరు విజయాలు, 13 పాయింట్లతో ఉన్న ఈ టీం.. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. ఈ టీం ప్లేఆఫ్స్ చేరడానికి 82 శాతం అవకాశం ఉంది. అంటే ఏదో అద్భుతం జరిగితే తప్ప ఈ రెండు టీమ్స్ దాదాపు ప్లేఆఫ్స్ చేరినట్లే.
ఇక మిగిలిన రెండు స్థానాలకే గట్టి పోటీ నెలకొంది. ఎందుకంటే ఈ రెండు స్థానాల కోసం లక్నో, బెంగళూరు, ముంబై, పంజాబ్, రాజస్థాన్ జట్ల మధ్య గట్టి పోటీ నెలకొంది. వీటితోపాటు ఇంకా కోల్‌కతా కూడా రేసులోనే ఉంది. ప్రస్తుతం రాజస్థాన్, బెంగళూరు, ముంబై, పంజాబ్ జట్లు పదేసి పాయింట్లతోనే ఉన్నాయి. అయితే నెట్ రన్ రేట్ కారణంగా రాజస్థాన్ నాలుగో స్థానంలో ఉంది. ఈ టీం ఆడిన చివరి మూడు మ్యాచుల్లో ఘోరంగా ఓడిపోవడం గమనార్హం.
సోమవారం నాడు కోల్‌కతా, పంజాబ్ జట్ల మధ్య మ్యాచ్‌లో పంజాబ్ గెలిస్తే అది పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరుతుంది. అదే కేకేఆర్ గెలిస్తే.. ఈ రేస్ మరింత రసవత్తరంగా మారుతుంది. ఎందుకంటే అప్పుడు ఆరు టీమ్స్ పదేసి పాయింట్లతో ఉంటాయి. అలాగే మంగళవారం నాడు ముంబై, బెంగళూరు తలపడతాయి. ఈ రెండింట్లో గెలిచిన టీం ముందడుగు వేస్తుంది.
ఈ లెక్కన ఒక్కో జట్టు ప్లేఆఫ్స్ చేరడానికి ఎంత వరకు అవకాశం ఉందో లెక్కలు కట్టాల్సి వచ్చింది. ఈ గణాంకాలు ఆసక్తికర ఫలితాలను చూపించాయి. ప్రస్తుతం లెక్కల ప్రకారం ప్లేఆఫ్స్ చేరడానికి లక్నోకు 45 శాతం , బెంగళూరుకు 42 శాతం, ముంబైకి 41 శాతం అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇక పంజాబ్‌కు 39 శాతం ఛాన్సులు ఉన్నాయి.
అదే సమయంలో వరుసగా మూడు మ్యాచుల్లో ఓటమిపాలైన రాజస్థాన్ అవకాశాలు బాగా దెబ్బతిన్నాయి. ప్రస్తుత మొమెంటంను దృష్టిలో పెట్టుకుంటే.. ఈ టీం ప్లేఆఫ్స్ చేరడానికి కేవలం 25 శాతమే అవకాశం ఉంది. ఇక కేకేఆర్‌కు 14 శాతం ఛాన్స్ ఉండగా.. పాయింట్ల పట్టికలో చివరి రెండు స్థానాల్లో ఉన్న సన్‌రైజర్స్‌కు 12 శాతం, ఢిల్లీకి 11 శాతం అవకాశాలు ఉన్నట్లు సమాచారం. మరి వీటిలో ఏ జట్లు అనూహ్యమైన విజయాలతో ప్లేఆఫ్స్ చేరతాయో చూడాలి.