చండీగఢ్: ఐపీఎల్ 2023 సీజన్‌లో ముంబై మరో అద్భుత విజయాన్ని అందుకుంది. 213 పరుగుల భారీ టార్గెట్‌ను అవలీలగా ఛేదించింది. పంజాబ్ కింగ్స్ నిర్దేశించిన అసాధ్యమనుకున్న లక్ష్యాన్ని ఇంకో ఏడుబంతులు మిగిలివుండగానే ఛేదించింది. ప్లేఆఫ్స్ రేసులోకి దూసుకొచ్చింది. మొన్నటివరకు పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచిన ముంబై ఇండియన్స్- ఇప్పుడు ఆరోస్థానానికి ఎగబాకింది.
బుధవారం రాత్రి మొహాలీ స్టేడియంలో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లల్లో మూడు వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. లియామ్ లివింగ్‌స్టొన్ విధ్వంసం సృష్టించాడు. 42 బంతుల్లో నాలుగు ఫోర్లు, ఏడు సిక్సర్లతో 82 పరుగులు చేశాడు. మరో ఎండ్‌లో జితేష్ శర్మ అదే తరహాలో సుడిగాలి ఇన్నింగ్ ఆడాడు. 27 బంతుల్లో రెండు సిక్సర్లు అయిదు ఫోర్లతో 49 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

అనంతరం బరిలోకి దిగిన ముంబై- ఈ లక్ష్యాన్ని కొట్టి పడేసింది. 18.5 ఓవర్లల్లోనే 214 పరుగులు చేసింది. ఓపెనర్ ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, టిమ్ డేవిడ్, హైదరాబాదీ తిలక్ వర్మ.. మొహాలీ స్టేడియంలో పరుగుల వరద పారించారు. డకౌట్‌తో రోహిత్ శర్మ విఫలమైనప్పటికీ- యంగ్ క్రికెటర్లు విజృంభించి ఆడారు.
ఈ మ్యాచ్‌లో ఓపెనర్ ఇషాన్ కిషన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. భారీ షాట్లతో పంజాబ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 41 బంతుల్లో నాలుగు ఫోర్లు, ఏడు సిక్సర్లతో 75 పరుగులు చేశాడు. అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో రిషి ధవన్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ముంబై ఇన్నింగ్‌లో అతనే టాప్ స్కోరర్. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ కూడా అతనికే దక్కింది.
పోస్ట్ మ్యాచ్ ప్రజంటేషన్ సందర్భంగా ఇషాన్ కిషన్ మాట్లాడాడు. ధాటిగా ఆడటానికి గల రహస్యాన్ని బయటపెట్టాడు. ఒత్తిడిలో ఎలా ఆడాలి? భారీ లక్ష్యం కళ్లముందు ఉన్నప్పుడు దాన్ని ఛేదించడానికి ఎలాంటి వ్యూహాలను అనుసరించాలి? క్రీజ్‌లో పాతుకుపోవడానికి ప్రాధాన్యత ఇస్తూనే బౌలర్‌పై కౌంటర్ అటాక్‌కు ఎలా దిగాలనే విషయంసై సీనియర్ క్రికెటర్లు ఓ బెంచ్ మార్క్‌ను క్రియేట్ చేశారని, దాన్ని ఫాలో అయ్యానని వ్యాఖ్యానించాడు.
మొహాలీ పిచ్ బ్యాటర్లకు పూర్తిగా అనుకూలంగా ఉందనే విషయం పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్‌తో స్పష్టమైందని, 20 ఓవర్లలోనే భారీ టార్గెట్‌ను ఛేదించాల్సి ఉంటుందనే విషయాన్ని గుర్తు పెట్టుకుని క్రీజ్‌లో దిగానని అన్నాడు. క్రీజ్‌లో కుదురుకోవడంతో పాటు బౌలర్లపై ఎదురుదాడికి దిగితేనే 213 పరుగుల లక్ష్యాన్ని అందుకోగలమంటూ హెడ్ కోచ్ మార్క్ బౌచర్ సూచించాడని, ఆ ప్లాన్‌కు అనుగుణంగా బ్యాటింగ్ చేశానని చెప్పుకొచ్చాడు.
వీటన్నింటికంటే మించి మ్యాచ్‌కు ముందు ఏం భోజనం చేశామనేది కూడా అత్యంత కీలక పాత్ర పోషిస్తుందని అన్నాడు. మ్యాచ్‌కు ముందు తాను అమ్మ చేతి వంటను తినొచ్చానని, అందుకే భారీ షాట్లను ఆడగలిగానని నవ్వుతూ చెప్పాడు. ఈ క్రెడిట్ అంతా అమ్మ చేతి వంటకే దక్కుతుందని ఇషాన్ కిషన్ అన్నాడు.