న్యూఢిల్లీ: ఐపీఎల్ 2023 సీజన్ ఇక ముగింపు దశకు వచ్చింది. ఈ నెల 21వ తేదీన చివరి లీగ్ మ్యాచ్ జరుగనుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు- గుజరాత్ టైటాన్స్ ఈ మ్యాచ్‌లో తలపడనున్నాయి. బెంగళూరులోని చిన్నస్టామి స్టేడియంలో సాయంత్రం 7:30 గంటలకు ఈ చివరి లీగ్ షెడ్యూల్ అయింది. ప్లేఆఫ్స్ చేరాలంటే రాయల్ ఛాలెంజర్స్‌కు గెలిచి తీరాల్సిన మ్యాచ్ ఇది.
అదే రోజు మధ్యాహ్నం 3:30 గంటలకు వాంఖెడే స్టేడియంలో మరో మ్యాచ్ జరుగనుంది. ముంబై ఇండియన్స్- సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనున్నాయి. ఇది- ముంబై ఇండియన్స్‌కు లైఫ్ అండ్ డెత్ గేమ్. ప్లేఆఫ్స్‌లో నిలవాలంటే సన్‌రైజర్స్‌ను ఓడించాల్సి ఉంటుంది.. అది కూడా భారీ తేడాతో. ఈ మ్యాచ్‌లో గెలిచినా ప్లేఆఫ్స్ చేరుతుందనే గ్యారంటీ ఏ మాత్రం లేదు. ముంబైకి బదులుగా ఆర్సీబీ ముందడుగు వేసే అవకాశాలు ఉన్నాయి.

మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో మట్టికరిచింది ముంబై ఇండియన్స్. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో- నిర్ణీత 20 ఓవర్లల్లో మూడు వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ ఈ టార్గెట్‌ను అందుకోలేకపోయింది. 20 ఓవర్లల్లో అయిదు వికెట్ల నష్టానికి 172 పరుగులు మాత్రమే చేయగలిగింది.
ఈ ఓటమితో నాలుగో స్థానానికి పడిపోయింది ముంబై ఇండియన్స్. ప్రస్తుతం ఆ జట్టు ఖాతాలో 14 పాయింట్లు ఉన్నాయి. ఒక మ్యాచ్ చేతిలో ఉంది. తన తదుపరి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఢీకొట్టాల్సి ఉంది. ఈ రెండు జట్లకూ అదే చివరి లీగ్. ఇందులో ముంబై గెలిస్తే పాయింట్ల సంఖ్య 16కు పెరుగుతుంది. ఓడితే మాత్రం 14 పాయింట్ల వద్దే ముంబై ఇండియన్స్ ప్రస్థానం నిలిచిపోతుంది. ఇతర జట్ల నెట్ రన్‌రేట్ మీద దాని భవిష్యత్ డిపెండ్ అయి ఉంటుంది.
అదే సమయంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా తన తదుపరి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తోనే ఢీ కొట్టనుంది. గురువారం సాయంత్రం హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో సాయంత్రం 7:30 గంటలకు ఈ మ్యాచ్ షెడ్యూల్ అయింది. ప్లేఆఫ్ రేసులో ఆర్సీబీ ముందడుగు వేయాలంటే ఈ మ్యాచ్‌ను గెలిచి తీరాల్సిందే. సన్‌రైజర్స్ చేతిలో ఓడితే మాత్రం సంక్లిష్టమౌతాయి. 21న గుజరాత్ టైటాన్స్‌తో జరిగే చివరి లీగ్‌లో గెలిచి తీరాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటుంది.
ఈ నేపథ్యంలో- ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఆ రెండు జట్ల పాలిట విలన్‌గా మారే అవకాశాలు లేకపోలేదు. ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకొంది సన్‌రైజర్స్. తన తదుపరి మ్యాచ్‌లల్లో రాయల్ ఛాలెంజర్స్, ముంబై ఇండియన్స్‌లను ఢీకొట్టబోతోంది. ఈ రెండింట్లో గెలిచినా సన్‌రైజర్స్‌కు ఒరిగేదేమీ ఉండదు. 12 పాయింట్లు ఆ జట్టు ఖాతాలో చేరుతాయి. దీనితో ప్లేఆఫ్స్‌కు వెళ్లలేదు.
ఈ రెండింట్లో గెలవడం అంటే రాయల్ ఛాలెంజర్స్, ముంబై ఇండియన్స్‌ను ఓడించడం వల్ల ఆ రెండు జట్ల ప్లేఆఫ్స్ అవకాశాలను మాత్రం దారుణంగా దెబ్బకొట్టగలుగుతుంది. సో- సన్‌రైజర్స్ జట్టు.. ముంబై, బెంగళూరులకు ఆపద్బాంధవుడిలా కనిపిస్తోంది. ఓడిపోయి తమ ప్లేఆఫ్స్ అవకాశాలను దెబ్బకొట్టకూడదనే ఆ రెండు జట్ల అభిమానులు కోరుకుంటోన్నారనడంలో సందేహాలు అక్కర్లేదు.