ఈ ఏడాది ఐపీఎల్‌లో ఆర్సీబీ పేసర్ మహమ్మద్ సిరాజ్ అద్భుతంగా ఆడుతున్నాడు. తాజాగా పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా నాలుగు వికెట్లు తీసుకొని ఆ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలోనే అతన్ని ఆర్సీబీ మేనేజ్‌మెంట్ ఇంటర్వ్యూ చేసింది. ఈ వీడియోను తమ యూట్యూబ్ ఛానెల్‌లో షేర్ చేసింది. ఈ క్రమంలోనే సిరాజ్ ఒక షాకింగ్ విషయం వెల్లడించాడు.
ప్రపంచ ప్రఖ్యాత ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డోకు చాలా పెద్ద ఫ్యాన్ బేస్ ఉంది. చాలా మంది సెలెబ్రిటీలు కూడా రొనాల్డోకూ అభిమానులే. ఈ జాబితాలో టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్ పేరు కచ్చితంగా ఉంటుంది. సిరాజ్‌కు రొనాల్డో అంతే చాలా అభిమానం. అందుకే రొనాల్డో తన గోల్స్ సెలబ్రేట్ చేసుకునే స్టైల్‌లో తను తీసే వికెట్లు సెలబ్రేట్ చేసుకునే వాడు.

అయితే ఇటీవలి కాలంలో సిరాజ్ ఇలా సెలబ్రేట్ చేసుకోవడం తగ్గించాడు. సాధారణంగానే సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. దీని వెనుక కారణం ఏంటా? అని అతని ఫ్యాన్స్ ఆలోచించినా సమాధానం దొరకలేదు. దీనిపై తాజాగా సిరాజ్ స్పష్టత ఇచ్చాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించాడు. ఇలా సెలబ్రేట్ చేసుకోవద్దని ట్రైనర్లు చాలా గట్టిగా చెప్పారట.
'మహమ్మద్ షమీ, మా ట్రైనర్లు అందరూ ఇలా సెలబ్రేట్ చేసుకోవద్దని చాలా గట్టిగా చెప్పారు. నేను రొనాల్డోకు చాలా పెద్ద అభిమానిని. అందుకే ఇలా సెలబ్రేట్ చేసుకుంటా. కానీ ఎప్పుడూ ఇలాగే సెలబ్రేట్ చేసుకోను కదా. కాబట్టి ఇలా చేసే సమయంలో నా కాళ్ల ఎముకలు మెలితిరిగి, జాయిట్లు దెబ్బతినే ప్రమాదం ఉంది. అందుకే ఇలా సెలబ్రేట్ చేసుకోవద్దని చాలా గట్టిగా చెప్పారు' అని వెల్లడించాడు.
కెరీర్ ఆరంభించిన కొత్తల్లో టెన్నిస్ బాల్ క్రికెట్ ఆడేవాడినని, అప్పట్లో బ్యాటర్‌గా ఆడేవాడినని సిరాజ్ చెప్పాడు. ఆ తర్వాత బౌలింగ్ వేయాలని అనుకున్నట్లు తెలిపాడు. 'డేల్ స్టెయిన్‌ను బాగా ఫాలో అయ్యేవాడిని. నాకు ఇన్‌స్వింగ్, అవుట్‌స్వింగ్ అంటే తెలీదు. కానీ చాలా వేగంగా బౌలింగ్ చేయాలని మాత్రమే అనుకునే వాడిని. ఆ తర్వాత ఇవన్నీ నేర్చుకున్నా' అని చెప్పాడు.
ఈ క్రమంలోనే రంజీల్లో ఆడే అవకాశం దక్కిందని, తను ఆడిన తొలి రంజీ మ్యాచులో ఒకే వికెట్ తీశానని గుర్తుచేసుకున్నాడు. భారత్‌కు ఆడే అవకాశం వస్తుందని కూడా తనెప్పుడూ అనుకోలేదని, అలా అనుకొని ఉంటే ఇప్పుడు ఇక్కడ ఉండేవాడిని కాదేమో? అని అన్నాడు. ఇక ఈ ఏడాది ఐపీఎల్‌లో ఆర్‌సీబీ క్యాంపెయిన్ గురించి మాట్లాడుతూ.. ఈ ఏడాది జట్టు వాతావరణం కొత్తగా ఉందన్నాడు. ఈ సీజన్‌లో తాము ట్రోఫీ నెగ్గే అవకాశం ఉందని ధీమా వ్యక్తం చేశాడు.