న్యూఢిల్లీ: ఐపీఎల్ 2023 సీజన్ సెకెండ్ హాఫ్.. హోరాహోరీగా సాగుతోంది. ప్లేఆఫ్స్ సమీపిస్తోన్న కొద్దీ అన్ని జట్లు తెగించి ఆడుతున్నాయి. ఫియర్‌లెస్ క్రికెట్ ఆడుతున్నాయి. వరుస ఓటములను చవి చూస్తోన్న జట్లన్నీ ప్లేఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంటోన్నాయి. ఢిల్లీ కేపిటల్స్, కోల్‌కత నైట్ రైడర్స్.. ఈ రేసు నుంచి దాదాపుగా తప్పుకొన్నట్టే.
రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమి తరువాత కోల్‌కత నైట్ రైడర్స్‌కు ప్లేఆఫ్స్ చేరే అవకాశాలు అయిదు శాతానికి క్షీణించాయి. 95 శాతం మేర ఆ జట్టు ఈ టోర్నమెంట్ నుంచి అవుట్ అయినట్టే. ఇప్పటివరకు 12 మ్యాచ్‌లను ఆడిన ఈ టీమ్.. ఏడింట్లో ఓడింది. అయిదింట్లో గెలుపుతో 10 పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉన్నప్పటికీ.. ముందుకు వెళ్లే అవకాశాలు లేవు.

ముంబై ఇండియన్స్ ఇవ్వాళ కీలక మ్యాచ్‌ను ఆడబోతోంది. గుజరాత్ టైటాన్స్‌ను ఢీకొట్టబోతోంది. ఈ సాయంత్రం 7:30 గంటలకు ముంబై వాంఖెడె స్టేడియంలో ఈ మ్యాచ్ షెడ్యూల్ అయింది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే- రోహిత్ సేన ప్లేఆఫ్స్ అవకాశాలు ఎంతగానో మెరుగుపడతాయి. 14 పాయింట్లతో మూడో స్థానానికి ఎగబాకుతుంది ఈ జట్టు. ప్లేఆఫ్స్‌కు మరింత చేరువ అవుతుంది.
ప్రస్తుతం పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది ముంబై ఇండియన్స్. ఇప్పటివరకు ముంబై ఇండియన్స్ 11 మ్యాచ్‌లను ఆడింది. ఆరింట్లో గెలుపుతో 12 పాయింట్ల సాధించింది. ఈ జట్టు నెట్ రన్‌రేట్ మైనస్ 0.255. ఇవ్వాళ గుజరాత్ టైటాన్స్‌పై ఓడిపోయినా కూడా ప్రస్తుతానికి ముంబై ఇండియన్స్ జట్టు స్థానానికి ఢోకా ఉండకపోవచ్చు గానీ అది శాశ్వతం మాత్రం కాదు.
టైటాన్స్‌తో ఓడిపోయినా ఇంకా రెండు మ్యాచ్‌లను ఆడాల్సి ఉంది. లక్నో సూపర్ జెయింట్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌లపై జరిగే మ్యాచ్‌లల్లో గెలిస్తే 16 పాయింట్లను దక్కించుకుంటుంది. 16 పాయింట్లను సాధించినంత మాత్రాన ప్లేఆఫ్స్ చేరలేకపోవచ్చు. ఎందుకంటే- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ కూడా 16 పరుగులను సాధించుకోవడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి. అదే జరిగితే ముంబై, బెంగళూరు, పంజాబ్ జట్ల మధ్య నెట్ రన్‌రేట్ కీలక పాత్ర పోషిస్తుంది.
రాయల్ ఛాలెంజర్స్, పంజాబ్ కింగ్స్‌లల్లో ఏ జట్టు 16 పాయింట్లను సాధించలేకపోయినా.. ముంబై ఇండియన్స్ తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటుంది. లక్నో సూపర్ జెయింట్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌లపై ఒక మ్యాచ్‌లో గెలిస్తే 14తో సరిపెట్టుకోవాల్సి ఉంటుంది. మిగిలిన జట్ల నెట్ రన్‌రేట్, గెలుపోటముల మీద ఆధారపడి ఉంటుంది రోహిత్ సేన భవిష్యత్. రెండింట్లో ఓడితే ముంబై కథ ముగిసినట్టే అవుతుంది.