జైపూర్: ఐపీఎల్ 2023 సీజన్ తుది దశకు చేరుకుంటోంది. లీగ్ మ్యాచ్‌లు ముగుస్తోన్నాయి. చిట్టచివరి లీగ్ మ్యాచ్ ఈ నెల 21వ తేదీన జరుగనుంది. బెంగళూరులోని ఎంఏ చిన్నస్వామి స్టేడియంలో జరిగే ఈ ఫైనల్ లీగ్ గేమ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-గుజరాత్ టైటాన్స్ ఢీ కొట్టబోతోన్నాయి. ఈలోగా ప్లేఆఫ్స్‌పై ఓ క్లియర్ పిక్చర్ వచ్చేస్తుంది.
రాజస్థాన్ రాయల్స్‌పై గురువారం రాత్రి ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన మ్యాచ్‌లో ఓటమితో కోల్‌కత నైట్ రైడర్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. దాదాపుగా తప్పుకొన్నట్టే. తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కత నిర్ణీత 20 ఓవర్లల్లో ఎనిమిది వికెట్ల నష్టానికి 149 పరుగులు చేయగా.. ఈ టార్గెట్‌ను రాజస్థాన్ రాయల్స్ 13.1 ఓవర్లలోనే ఛేదించింది. ఆ క్రమంలో ఒక్క వికెట్టే నష్టపోయిందా జట్టు.

ఓపెనర్ యశస్వి జైస్వాల్ మరోసారి దుమ్మురేపాడు. 62 బంతుల్లో అయిదు సిక్సర్లు, 12 ఫోర్లతో 98 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. కేప్టెన్ సంజు శాంసన్ 48 పరుగులతో అతనికి తనవంతు సహకారాన్ని అందించాడు. ఈ విజయంతో రాజస్థాన్ రాయల్స్ పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరుకుంది. చివరి మూడు మ్యాచ్‌లల్లో ఎదురైన పరాజయాలకు అడ్డుకట్ట వేసింది. ప్లేఆఫ్స్‌కు మరింత చేరువైంది.
ఈ మ్యాచ్‌లో డాషింగ్ ఓపెనర్ జోస్ బట్లర్ విఫలం అయ్యాడు. పరుగులేవీ చేయకుండాను వెనుదిరిగాడు. ఇన్నింగ్ తొలి ఓవర్‌లోనే అతను అవుట్ అయ్యాడు. హర్షిత్ రాణా వేసిన ఆ ఓవర్ నాలుగో బంతికి బ్యాక్ ఫుట్ మీద డిఫెన్స్ ఆడాడు జోస్ బట్లర్. థై ప్యాడ్స్‌కు తగిలిన ఆ బంతి కవర్ పాయింట్ వేపు వెళ్లింది. నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న యశస్వి జైస్వాల్ పరుగు కోసం ప్రయత్నించాడు. అప్పటికే హాఫ్ పిచ్ వరకు వచ్చేశాడు.
దీనితో తప్పనిసరిగా రన్ తీయాల్సి వచ్చింది బట్లర్‌కు. నాన్ స్ట్రైకింగ్ ఎండ్ క్రీజ్‌ను చేరుకోలేనని తెలిసినప్పటికీ లేని పరుగు కోసం ప్రయత్నించాడు. అతను నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌లోకి చేరుకునే లోపే కవర్స్ దిశ నుంచి ఆండ్రీ రస్సెల్స్ సంధించిన డైరెక్ట్ హిట్ వికెట్లను గాల్లోకి లేపింది. అప్పటికే ఆరు బంతుల్లో 26 పరుగులు చేశాడు జైస్వాల్. అతని కోసం తన వికెట్‌ను త్యాగం చేసినట్టయింది.
ఈ మ్యాచ్‌లో కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఉల్లంఘించిన కారణంగా బట్లర్‌పై జరిమానా పడింది. అతనికి చెల్లించే మ్యాచ్ ఫీజులో నుంచి 10 శాతం కోత పెట్టినట్లు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ తెలిపింది. దీనికి గల కారణాన్ని వెల్లడించలేదు. లెవెల్ 1 ఉల్లంఘన కింద అతనికి ఫైన్ వేసినట్లు పేర్కొంది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.
ఏ ప్లేయర్ అయినా క్రికెట్ ఎక్విప్‌మెంట్, క్లాత్, గ్రౌండ్ ఫిక్స్చర్స్-ఫిట్టింగ్స్‌ను దూషించడాన్ని లెవెల్ 1 నేరంగా భావిస్తుంది ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్. ఏదైనా చర్య లేదా శబ్దం చేయడం ద్వారా అంపైర్ నిర్ణయంపై అసహనం వ్యక్తం చేయడం, అశ్లీల, అభ్యంతరకర, అవమానకర పదాలను పలకడం లేదా సంకేతాలు ఇవ్వడం, పెవిలియన్/డ్రెస్సింగ్ రూమ్ వైపు దుందుడుకుగా వెళ్లడాన్ని కూడా లెవెల్ 1 ఉల్లంఘనగా పరిగణిస్తుంది.