ఐపీఎల్ 16వ సీజన్‌కు అంతా రెడీ అయింది. ఓపెనింగ్ గేమ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడుతున్నాయి. అయితే ఈ మ్యాచ్‌లో చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఆడతాడా? అతను పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నాడా? అనేది పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే ట్రైనింగ్ సెషన్‌లో ధోనీ అంతలా ఇబ్బంది పడ్డాడని వార్తలు వస్తున్నాయి. బ్యాటింగ్ ప్రాక్టీస్ సమయంలో సిక్సర్లు బాది, చెపాక్ స్టేడియంలోని ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగించిన ధోనీ పూర్తి ఫిట్‌గా లేడని తెలుస్తోంది.
ధోనీ ఎడమ మోకాలి నొప్పితో బాధ పడుతున్నాడట. అందుకే బ్యాటింగ్ ప్రాక్టీస్‌కు వచ్చే ముందు కూడా 'నీ క్యాప్' వేసుకొని, మోకాళ్లపై కూర్చొని నొప్పి తట్టుకోగలనా? అని చెక్ చేసుకొని నెట్స్‌లోకి వచ్చాడు. ఒకసారి నెట్స్‌లో అడుగు పెట్టిన తర్వాత మాత్రం భారీ షాట్లు ఆడి అందర్నీ అలరించాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత తొలిసారి చెపాక్‌లో బ్యాటింగ్ చేస్తూ కనిపించాడు ధోనీ. అంతకుముందు కూడా ధోనీ సరిగా నడవలేకపోయాడు. మోకాలి నొప్పితో కుంటుకుంటూ నడిచాడు.

అంతకుముందు గ్రౌండ్ చుట్టూ పరుగు తీసే సమయంలో కూడా ధోనీ.. ఆగకుండా మైదానంలో రౌండ్లు కొట్టలేకపోయాడు. మోకాలి నొప్పితో మధ్య మధ్యలో ఆగిపోతూ కనిపించాడు. ఇలా ప్రాక్టీస్ సెషన్‌లో కూడా ధోనీ పూర్తి ఫిట్‌గా లేకపోవడంతో అభిమానుల మధ్య పెద్ద చర్చకు దారి తీసింది. గుజరాత్‌తో జరిగే ఐపీఎల్ ఓపెనింగ్ గేమ్‌లో ధోనీ ఆడడేమో? అనే వదంతులకు అవకాశం ఇచ్చింది. ఈ విషయంలో చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం కానీ, ధోనీ కానీ ఎలాంటి ప్రకటన చేయలేదు. అన్నీ అనుకున్నట్లు కుదిరితే ధోనీ నాయకత్వంలోనే గుజరాత్‌తో చెన్నై తలపడాల్సి ఉంది. కానీ అలా జరిగేలా కనిపించడం లేదు.
ఒక వేళ ధోనీ కనుక తొలి మ్యాచ్‌కు దూరమైతే.. జట్టు పగ్గాలను ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్‌కు అందిస్తారని తెలుస్తోంది. అంతేకాదు, తను కూడా గాయంతో ఇబ్బంది పడుతున్న స్టోక్స్.. ఐపీఎల్ ఆరంభ మ్యాచుల్లో బౌలింగ్ చేయడం కుదరదట. దీంతో అతను పూర్తి బ్యాటర్‌గానే జట్టులో ఆడతాడని తెలుస్తోంది. ఇలా ధోనీ, స్టోక్స్ ఇద్దరూ ఫిట్‌గా లేకపోతే చెన్నై జట్టు కష్టాల్లో పడటం ఖాయమని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.