అహ్మదాబాద్: ఐపీఎల్ 2023లో గుజరాత్ టైటాన్స్ తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. గత ఏడాదే ఈ ధనాధన్ ఫార్మట్ సీజన్‌లో అడుగు పెట్టిన ఈ టీమ్.. అదే ఏడాది ఛాంపియన్‌గా నిలిచింది. ఇప్పుడు కూడా వరుస విజయాలతో దూసుకెళ్తోంది. ఇప్పటికే ప్లేఆఫ్స్ కూడా ఖాయం చేసుకున్నట్టే. ఇప్పటివరకు 10 మ్యాచ్‌లను ఆడిన హార్దిక్ పాండ్యా టీమ్ 14 పాయింట్లను తన ఖాతాలో వేసుకుంది.
పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోందీ జట్టు. తన తదుపరి మ్యాచ్‌ను ఆదివారం ఆడబోతోంది. మధ్యాహ్నం 3:30 గంటలకు లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ షెడ్యూల్ అయింది. తన చివరి మ్యాచ్‌లో ఢిల్లీ కేపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓడిపోయిన నేపథ్యంలో దీన్ని గెలిచి తీరాలనే పట్టుదలను ప్రదర్శిస్తోంది గుజరాత్ టైటాన్స్.

ఈ పరిణామాల మధ్య బిగ్ షాక్ తగిలిందా జట్టుకు. స్టార్ బౌలర్ జోషువా లిటిల్ జట్టును వీడాడు. లిటిల్.. ఐర్లాండ్‌కు చెందిన లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్. తన దేశం తరఫున ఇంటర్నేషనల్ మ్యాచ్‌లను ఆడాల్సి ఉందతనికి. ఈ నేపథ్యంలో స్వదేశానికి బయలుదేరి వెళ్లాడు. ఆదివారం నాడు లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగే మ్యాచ్‌కు అందుబాటులో ఉండట్లేదు.
లిటిల్‌కు ఇదే తొలి ఐపీఎల్. ఐర్లాండ్ తరఫున అంతర్జాతీయ మ్యాచ్‌లల్లో తడాఖా చూపిన నేపథ్యంలో అతణ్ని జట్టులోకి తీసుకుంది గుజరాత్ టైటాన్స్. 4.40 కోట్ల రూపాయలను అతనిపై ఖర్చు పెట్టింది. దీనికి తగ్గట్టుగా సత్తా చాటాడతను. ఇప్పటివరకు ఎనిమిది మ్యాచ్‌లను ఆడిన అతను ఆరు వికెట్లను పడగొట్టాడు. 2/25 అతని బెస్ట్ బౌలింగ్ ఫిగర్. 8.21 ఎకానమీని రికార్డ్ చేశాడు.
బంగ్లాదేశ్-ఐర్లాండ్ మధ్య ఈ నెల 9వ తేదీ నుంచి మూడు వన్డే ఇంటర్నేషనల్స్ మ్యాచ్‌ల సిరీస్ ఆరంభం కాబోతోంది. ఇందులో ఆడబోయే జట్టును ఐర్లాండ్ క్రికెట్ బోర్డ్ ఇదివరకే ప్రకటించింది కూడా. ఈ జట్టులో జోషువా లిటిల్‌కు చోటు దక్కింది. ఈ సిరీస్ ముగిసిన అనంతరం అతను మళ్లీ భారత్‌కు బయలుదేరి వస్తాడు. జట్టుతో కలుస్తాడు. ఈ నెల 14వ తేదీ నాటికి అతను జట్టుకు అందుబాటులో ఉండొచ్చని గుజరాత్ టైటాన్స్ డైరెక్టర్ విక్రమ్ సోలంకి తెలిపారు.