చండీగఢ్: ఐపీఎల్ 2023 సీజన్ సెకెండ్ హాఫ్.. రసవత్తరంగా సాగుతోంది. స్టేడియాల్లో పరుగుల వరద పారుతోంది. భారీ లక్ష్యాలు సైతం గల్లంతవుతున్నాయి. 200లకు పైగా చేసిన టార్గెట్ కూడా గెలుపుపై గ్యారెంటీ ఇవ్వట్లేదు. 200లకు పైగా పరుగులు చేసిన జట్లు కూడా పరాజయాన్ని చవి చూస్తోన్నాయంటే ఈ సీజన్‌లో పోటీ ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
బుధవారం రాత్రి మొహాలీలో ముంబై ఇండియన్స్ 200లకు పైగా టార్గెట్‌ను అలవోకగా ఛేదించింది. పంజాబ్ కింగ్స్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఇంకా ఏడు బంతులు మిగిలివుండగానే కొట్టిపడేసింది. రెండు జట్ల ఇన్నింగ్స్‌లోనూ బ్యాటర్లు దుమ్మ లేపారు. బౌలర్లపై సునామీలా విరుచుకుపడ్డారు. టీ20 ఫార్మట్‌లో ఒక్క మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్ కలిపి 427 పరుగులు నమోదు కావడం అంటే మాటలు కాదు.

ఈ సీజన్ మ్యాచ్‌లన్నీ బౌలర్లకు నైట్ మేర్‌గా మారుతున్నాయి. బ్యాటర్లు తెగించి ఆడుతున్నారు. కౌంటర్ అటాక్‌కు దిగుతున్నారు. ఫియర్‌లెస్ క్రికెట్ ఆడటానికి ప్రాధాన్యతను ఇస్తోన్నారు. ఇక ప్లేఆఫ్స్ సమీపిస్తోన్న కొద్దీ మ్యాచ్‌లు మరింత రంజుగా మారుతున్నాయి. జట్ల మధ్య పోటీ తీవ్రతరమౌతోంది. గెలిచి తీరాలనే తపన కనిపిస్తోంది. ప్లేఆఫ్స్ రేసులో తామూ ఉండాలనే పట్టుదలను ప్రదర్శిస్తోన్నాయి.
మొన్నటివరకు పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉన్న ముంబై ఇండియన్స్.. టాప్ పొజీషన్ వైపు దూసుకెళ్తోంది. పాయింట్ల పట్టికలో ప్రస్తుతం ఈ జట్టు ఆరో స్థానంలో నిలిచింది. తొమ్మిది మ్యాచ్‌లల్లో అయిదు విజయాలతో 10 పాయింట్లను తన ఖాతాలో వేసుకోగలిగింది రోహిత్ సేన. శనివారం తన తదుపరి మ్యాచ్‌ను ఆడబోతోంది. చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడటానికి సన్నద్ధమౌతోంది.
ఈ పరిస్థితుల మధ్య తాజాగా- టీమిండియా మాజీ ప్లేయర్ హర్భజన్ సింగ్ తెర మీదికి వచ్చారు. ప్లేఆఫ్స్‌పై జోస్యం చెప్పారు. ప్లేఆఫ్స్ ఆడబోయే నాలుగు జట్ల పేర్లను వెల్లడించారు. చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్.. ఈ సీజన్‌లో ప్లేఆఫ్స్ చేరుకుంటాయని అంచనా వేశారు. తన అంచనాలు తప్పే అవకాశం లేదని వ్యాఖ్యానించారు.
లక్నో సూపర్ జెయింట్స్, రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ సైతం ప్లేఆఫ్స్‌లో అడుగు పెట్టే అవకాశాలు ఉన్నప్పటికీ- తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుందని పేర్కొన్నాడు. ఈ మూడు జట్లూ ప్లేఆఫ్స్ కోసం గట్టి పోటీ ఇస్తాయని చెప్పారు. ఈ సీజన్‌లో ఏ జట్టు ఛాంపియన్‌గా నిలుస్తుందనేది ఇప్పుడే ఓ అంచనాకు రాలేమని, దీనికి ఇంకా సమయం ఉందని పేర్కొన్నాడు.
ప్రస్తుతం 12 పాయింట్లతో గుజరాత్ టైటాన్స్.. పాయింట్స్ టేబుల్ టాపర్‌గా నిలిచింది. చెన్నై సూపర్ కింగ్స్ ఖాతాలో 11 పాయింట్లు ఉన్నాయి. మూడో స్థానంలో నిలిచింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ పదేసి చొప్పున పాయింట్లతో 5, 6 స్థానల్లో నిలిచాయి. ఆయా జట్లన్నీ అయిదుకు పైగా మ్యాచ్‌లను ఆడాల్సి ఉన్న నేపథ్యంలో ప్లేఆఫ్స్ రేసు రసవత్తరంగా మారినట్టయింది.