ఐపీఎల్ 2023లో కొత్త కుర్రాళ్లు కావలసినంత అటెన్షన్ సంపాదిస్తున్నారు. యశస్వి జైస్వాల్, రింకూ సింగ్ వంటి వాళ్లు అదరగొడుతున్నారు. అలాగే సూర్యకుమార్ యాదవ్ కూడా మంచి ఫామ్ అందుకొని బౌలర్లను చెండాడుతున్నాడు. ఈ క్రమంలో టీమిండియా మాజీ సెలెక్టర్ సాబా కరీం కీలక వ్యాఖ్యలు చేశాడు.
కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ ఓపెన్ యశస్వి జైస్వాల్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 13 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. ఇక ఆ తర్వాత కూడా జోరు కొనసాగించాడు. అయితే అతను సెంచరీకి రెండు పరుగుల దూరంలో ఉండగానే ఆ జట్టు విజయం సాధించింది. దీంతో సెంచరీ మిస్ చేసుకున్నాడు.

ఇక ఆర్సీబీపై సూర్యకుమార్ మరో మాస్టర్ క్లాస్ ఆట చూపించాడు. మైదానం అన్ని వైపులా భారీ షాట్లు ఆడాడు. తాజాగా గుజరాత్ టైటాన్స్‌పై కూడా చెలరేగాడు. కేవలం 49 బంతుల్లోనే 103 పరుగులతో అజేయంగా నిలిచాడు. దీంతో గుజరాత్ ముందు ముంబై భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఛేజింగ్‌లో తడబడిన గుజరాత్ ఓటమిని మూటగట్టుకుంది.
ఈ నేపథ్యంలోనే సాబా కరీం ట్విట్టర్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశాడు. జైస్వాల్, సూర్య వంటి వాళ్ల బ్యాటింగ్ చూస్తుంటే.. ప్రస్తుత టీ20 క్రికెట్‌లో కోహ్లీ, రోహిత్‌ల ఆటతీరు పనికిరాదని అభిప్రాయపడ్డాడు. 'జైస్వాల్, స్కై బ్యాటింగ్ చూస్తుంటే.. రోహిత్ శర్మ, కోహ్లీలను టీ20 క్రికెట్ దాటేసిందని చాలా క్లియర్‌గా కనిపిస్తోంది. ఏమంటారు?' అని అనిల్ కుంబ్లే, హర్షభోగ్లేలను ట్యాగ్ చేశాడు.
ఈ ఐపీఎల్ సీజన్‌లో బ్యాటుతో రోహిత్ పెద్దగా ఆకట్టుకోలేదు. మొత్తం 12 మ్యాచుల్లో కేవలం 220 పరుగులే చేశాడు. అయితే అతని కెప్టెన్సీలో ముంబై అద్భుతంగా పుంజుకొని పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరింది. ఇక కోహ్లీ మాత్రం ఈ సీజన్‌లో అద్భుతంగా రాణిస్తున్నాడు. ఆర్సీబీ బ్యాటింగ్‌లో చాలా కీలకంగా మారాడు.
ఐపీఎల్ 2023లో అత్యధిక పరుగలు చేసిన బ్యాటర్ల జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నాడీ స్టార్ బ్యాటర్. మొత్తం 11 మ్యాచుల్లో 420 పరుగులతో ఆకట్టుకున్నాడు. కానీ మిగతా వాళ్లు పెద్దగా రాణించకపోవడంతో పాయింట్ల పట్టికలో ఆ జట్టు ఆరో స్థానంలో నిలిచింది. మిగతా మ్యాచుల్లో ఎలాగైనా గెలిచి ప్లేఆఫ్స్ చేరుకోవాలని ఆ టీం భావిస్తోంది.